CM Chandrababu on YS Jagan Mohan Reddy : జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు చేయవద్దని మాత్రమే చెప్పామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై, ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో సీఎం మండిపడ్డారు. జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరైనా నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. తిరుపతిలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయన్న సీఎం, దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు.
నాలుగు గోడల మధ్యే ఎందుకు చదవాలి: తిరుమల హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రమని, భక్తులు పవిత్రంగా భావించే క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆచారాలు పాటించకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఇంతకుముందు జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్లారని తెలిపారు. చాలామంది డిక్లరేషన్ ఇచ్చి గౌరవంగా దర్శనం చేసుకున్నారన్న చంద్రబాబు, ఇతర మతాలను గౌరవించడం అంటే ఆయా ఆలయాల సంప్రదాయాలను పాటించడమే అని స్పష్టం చేశారు. బైబిల్‌ను నాలుగు గోడల మధ్యే ఎందుకు చదవాలని, చర్చికి కూడా వెళ్లి బైబిల్ చదవవచ్చని అన్నారు.
కల్తీ జరగలేదని మీరు ఎలా చెబుతున్నారు: చెప్పిన అబద్ధాన్నే పదేపదే చెబుతున్నారని, నెయ్యి కల్తీ జరగలేదని అంటున్నారని మండిపడ్డారు. ఏఆర్ డెయిరీ 8 ట్యాంకర్లు పంపిందని, 4 ట్యాంకర్లు వాడారని తెలిపారు. ఈ నివేదిక ఇచ్చింది ఎన్‌డీడీబీ అని, తాము కాదన్నారు. ఈ నివేదికను దాస్తే మేం తప్పు చేసినట్లే అవుతుందన్నారు. నెయ్యి కల్తీ జరగలేదని మీరు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. తెలిసీ తెలియక పొరపాట్లు చేస్తే సంప్రోక్షణ చేస్తారని, అందుకే ఈ నెల 23న శాంతి యాగం చేశారని చెప్పారు. టెండర్లు పిలిచేందుకు నిబంధనలు ఎందుకు మార్చారో చెప్పాలని నిలదీశారు. నాసిరకం పదార్థాలతో ప్రసాదాన్ని అపవిత్రం చేశారన్న చంద్రబాబు, ఈవో చెప్పలేదు, నివేదికలు లేవు అంటూ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
తిరుమలలో ఎప్పట్నుంచో డిక్లరేషన్ ఉంది: రామతీర్థం, అంతర్వేది ఘటనలపై ఇప్పటివరకు విచారణ జరగలేదన్న చంద్రబాబు, రాజకీయ పార్టీకి ఉండాల్సిన అర్హతలు, లక్షణాలు మీకున్నాయా అని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని దుయ్యబట్టారు. దళితులను ఆలయాల్లోకి రానీయడం లేదని మీకెవరు చెప్పారని ప్రశ్నించారు. క్వాలిటీ, స్వచ్ఛత, పవిత్రత చాలా ముఖ్యమన్న చంద్రబాబు, ఇష్టం ఉంటే వెళ్లండని, ఇష్టం లేకుంటే వెళ్లవద్దని అన్నారు. ఆలయానికి వెళ్తే మాత్రం అక్కడున్న నియమాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలో అపవిత్రత జరగకుండా చూస్తామన్న సీఎం, తిరుమలలో ఎప్పట్నుంచో డిక్లరేషన్ ఉందని, దానిని పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు.
తప్పు చేసిన అందరిపై చర్యలు ఉంటాయి: సీఎం చట్టాలను, సంప్రదాయాలను గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలని, అడల్టరేషన్ పరీక్షకు గతంలో మీరు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. క్రైస్తవుడిని అని ఒప్పుకున్నాక డిక్లరేషన్ ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటని మండిపడ్డారు. అన్య మతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. అన్య మతం పాటించే ప్రముఖులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. స్వామివారిని రాజకీయాలకు, వ్యాపారాలకు వాడుకోవడం చేసిన తప్పు అని, టీటీడీ అధికారుల నియామకంలో వైఎస్సార్సీపీ వాళ్లు చేసింది అధికార దుర్వినియోగమని ధ్వజమెత్తారు. కల్తీ ఘటనలో తప్పు చేసిన అందరిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రాజకీయ ముసుగులో నేరస్థులు వస్తే: మీరు చేసిన అబద్ధాలను ఖండించకుంటే అవే నిజమని అనుకుంటారన్న చంద్రబాబు, తెలిసీ తెలియక ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలన్నారు. తప్పు జరిగినప్పుడు విచారం వ్యక్తం చేయాలని, ఎదురుదాడి కాదని దుయ్యబట్టారు. స్వామివారికి మీరు చేసిన అపచారాలు నేను కప్పిపుచ్చాలా అని నిలదీశారు. రాజకీయ ముసుగులో నేరస్థులు వస్తే ఇలాంటివే జరుగుతాయన్న చంద్రబాబు, మీరు నియమించిన జాయింట్ ఈవో ఎక్కడ్నుంచి వచ్చారని ప్రశ్నించారు. చేసిన తప్పును ఎంతగా సమర్థించుకున్నా అది ఒప్పు కాదన్నారు. తిరుమల పవిత్రత కాపాడేందుకు త్వరలో సమావేశం అవుతామని చెప్పారు.
వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉన్నట్లు హిందూయేతరులు పత్రాన్ని ఇవ్వాలి - TTD set up Rules Boards