Hello AP Bye Bye YCP : అమరావతి, పోలవరం" ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల సౌధాలు. రాష్ట్ర ప్రజలకు అవి రెండు కళ్లు. ఆ రెండింటికీ భరోసా ఇస్తోంది ఎన్డీఏ కూటమి. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండింటినీ పూర్తి చేస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లొస్తాయని అమిత్ షా పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు నివేదికలున్నాయని అమిత్ షా వెల్లడించారు. తాజా సర్వేలు, కేంద్ర ప్రభుత్వం అగ్రనేతల వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో అధికార మార్పిడి ఖాయమని ప్రజలు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఓ వైపు టీడీపీ, బీజేపీ, జనసేన(ఎన్డీఏ), మరోవైపు వైఎస్సార్సీపీ, ఇంకో వైపు కాంగ్రెస్, వామపక్షాలు (ఇండియా) ఏపీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉన్నా.. ప్రధాన పోటీ ఎన్డీఏ కూటమి, వైఎస్సార్సీపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. మరో వైపు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఏపీలో పర్యటిస్తున్నారు. ధర్మవరంలో అమిత్ షా, కడప, కర్నూలులో రాజ్నాథ్ సింగ్ ప్రచారం, ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సైతం అతి త్వరలో రాష్ట్రంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
'పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది' - ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోదీ హామీ - Narendra Modi Interview
టీడీపీ, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజాగళం సభలకు జనం పోటెత్తుతున్నారు. సభలు ఎక్కడ జరిగినా ప్రభంజనంలా కదలి వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాలను ఎండగడూతూ ఐదేళ్లలో రాష్ట్రం వెనుకబాటుకు కారణమైన జగన్ను ప్రజాక్షేత్రంలో నిలదీస్తుంటే చప్పట్లు, ఈలలతో హోరెత్తిస్తున్నారు. మూడు పార్టీల శ్రేణులు ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరో వైపు యువనేత నారా లోకేశ్ యువగళం సభలతో యువతతో మమేకం అవుతున్నారు. ఊహించని ప్రజా స్పందన మధ్య సభలు కొనసాగుతున్నాయి.
వైఎస్సార్సీపీ అభ్యర్థులకు భూ యాజమాన్య హక్కు చట్టం భయం పట్టుకుంది. దేశంలో ఎక్కడా లేని చట్టాన్ని ఇక్కడ బలంగా రుద్దాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. దీంతో అధికార పార్టీ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓటమి తప్పదనే భయం వారిని వెంటాడుతోందని తెలుస్తోంది.