Vote Awareness Campaign Under Eenadu-ETV Andhra Pradesh : జనవరి 25 ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు ప్రాధాన్యం, నమోదుపై 'ఈనాడు - ఈటీవీ ఆంధ్రప్రదేశ్' ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలు కళాశాలల్లో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, సత్యసాయి, అనంతపురం జిల్లాలోని కళాశాలల్లో యువతకు ఓటుహక్కుపై చైతన్యాన్ని కల్పించారు. ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత యువతరంపై ఉందని, అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 'ఈనాడు - ఈటీవీ ఆంధ్రప్రదేశ్' ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు నమోదు, అవగాహన సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సులు
Bapatla District : ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతరంపై ఉందని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ ప్రభాకరరావు అన్నారు. ఓటర్ల చైతన్యం కోసం ఈనాడు-ఈటీవీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ జయశ్రీ విద్యార్థులకు సూచించారు. పల్నాడు జిల్లా గురజాలలోని స్కాలర్స్ కళాశాలలో ముఖ్య అతిథిగా హాజరైన పిడుగురాళ్ల డిప్యూటి తహసీల్దార్ అనురాధ విద్యార్థులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. పిడుగురాళ్ల టౌన్ ప్లానింగ్ అధికారి ధనలక్ష్మి విద్యార్థులతో ఓటరు హెల్ప్‌లైన్ యాప్ డౌన్లోడ్ చేయించి, ఓటు ఎలా నమోదు చేసుకోవాలో వివరించారు.
Nandyala District : ఓటుహక్కును సమర్థులైన పాలకులను ఎన్నుకునేందుకు వినియోగిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రామకృష్ణ డిగ్రీ కళాశాల నినదించారు. 'ఈనాడు - ఈటీవీ ఆంధ్రప్రదేశ్', రామకృష్ణ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటు ప్రాధాన్యాన్ని సక్రమంగా వినియోగించకపోతే జరిగే నష్టాలను వివరించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
ఈటీవీ - ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు చైతన్య సదస్సు
Anantapur District : యువతకు ఓటు నమోదు, హక్కుపై అవగాహన సదస్సులో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని గీతాంజలి నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు ఓటు ప్రాధాన్యత గురించి వక్తలు వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులుపై వారికి అవగాహన కల్పించారు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటు హక్కు లేని వారితో దరఖాస్తు చేయించారు.
NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తేజ డీవీఆర్ కళాశాలలో 'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో ఓటరు అవగాహన చైతన్య సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ షేక్ మొలి విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పుట్టపర్తిలోని డైట్ కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో సుధామణి పాల్లొని ఓటు విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కృష్ణాజిల్లాలోని వేమూరి సుందర రామయ్య డిగ్రీ, పీజీ కళాశాల నందు జరిగిన సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని అనంతపురం జిల్లా కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జరిగిన ఓటు అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తి కనబరిచారు.