Prathidhwani on Union Budget 2024 : కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ కసరత్తు మొదలైన వేళ మరోసారి ఆశలపల్లకిలో ఊగిసలాడుతున్నాడు వేతనజీవుడు. ఈసారైనా వారి ఆశలు నెరవేరనున్నాయా? ఆదాయపన్ను శ్లాబులు, రేట్ల విషయంలో మార్పులు రానున్నాయా? ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వస్తోన్న సంకేతాలు, నిపుణుల అంచనాలైతే అటువైపే మొగ్గు చూపిస్తున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, ఆదాయాల్లో కానరాని పెరుగుదల, అధిక ధరలతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్న వేళ తగ్గింపులు ఉండొచ్చన్న ఆశాభావమే బలంగా వ్యక్తమవుతోంది.
వచ్చే నెలలోనే ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తీపికబర్లు చెప్పవచ్చని అంతా ఎదురు చూస్తున్నారు. వినియోగం పెంచే దిశగానే బడ్జెట్ ప్రతిపాదనలని అంచనాలు మరి, ఈ విషయంలో వేతనజీవులు, మధ్యతరగతి ఆశలు, ఆకాంక్షలు ఏమిటి? ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? తగ్గించినా గరిష్ఠంగా ఎంతవరకు ప్రయోజనం చేకూర్చవచ్చు? భారం తగ్గించాల్సిన అవసరంపై నిపుణులేం చెబుతున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలోవివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ వీవీకే ప్రసాద్, సీనియర్ ఛార్టెడ్ అకౌంటెంట్ త్రిపురనేని గోపీచంద్ పాల్గొన్నారు.
తొలి రోజునే బడ్జెట్ : కేంద్రం జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అంతకంటే ముందు ప్రత్యేక సమావేశాల చివరి రోజైన జులై 3న ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందు ఉంచనున్నట్లు తెలిపాయి. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మోదీ 3.0 ఫస్ట్ బడ్జెట్ : ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ 2024 ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు నూతన సర్కార్ ఏర్పడటంతో పూర్తి స్థాయి పద్దును తీసుకురానున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే కానుండడం గమనార్హం. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ పొందనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరసగా ఆరుసార్లు బడ్జెట్ సమర్పించారు.