World free trip: పైసా ఖర్చు లేకుండా ప్రపంచ యాత్ర చేస్తే ఎలా ఉంటుందంటారు! కలలో సాధ్యమే కానీ, నిజంగా జరుగుతుందా అని ఆలోచిస్తున్నారా? అది అసాధ్యమేమీ కాదు. అక్షరాలా సుసాధ్యమే. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఏ వీధిలో అయినా తిరిగి రావచ్చు. 'ఈటీవీ భారత్'తో కలిసి వెళ్దాం పదండి!
అసలు పక్క ఊరికి వెళ్లి రావడానికే పైసల్లేవంటే... ప్యారిస్ ఎలా వెళ్లగలం అనుకుంటున్నారా? కానీ, ఇది సాధ్యమే. ఒక్క ప్యారిస్ ఏం ఖర్మ! ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్లాలనుకున్నా వెళ్లొచ్చు. ఆగ్రాలో తాజ్ మహల్ అందాలు తిలకించాలన్నా, ప్యారిస్‌లో సగర్వంగా తలెత్తి ఈఫిల్ టవర్ చూడాలన్నా.. చైనాలో త్రీ గోర్జెస్ ప్రాజెక్టు, లండన్‌లో లార్డ్స్ క్రికెట్ మైదానం సహా ప్రపంచంలో నలుమూలలు చుట్టేసి రావొచ్చు.
'అలాంటి అవకాశమేదైనా సరే వదులుకునే ప్రసక్తే లేదు' అని మనసులో ఆలోచిస్తున్నారా? మనం ముందుగా అనుకున్నట్టుగా ప్యారిస్ వెళ్లామనుకోండి. అక్కడ వీధులు మనకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. సైకిళ్లు, కార్లు, బస్సుల మధ్య వీధుల్లో మనం నడుస్తూ వెళ్లొచ్చు. పక్కనే ఉన్న వాగులు, నదులు కూడా తిలకించవచ్చు. ఇక తాజ్‌మహల్ వెళ్తే అతి సమీపం నుంచి చూసే వీలుంటుంది. మనసులో గట్టిగా అనుకుంటే తాజ్‌మహల్ పాలరాయి గోడలు కూడా అతి సమీపం నుంచి చూసేయొచ్చు.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే..! మీరు ఇంట్లో ఉండి... క్షణానికో దేశానికి వెళ్లి మీరు కోరుకున్న ప్రాతంలో విహరించి రావొచ్చు కూడా. టైం మిషన్ లాంటివి ఏమైనా కనిపెట్టారా అని ఆలోచిస్తున్నారా? సరిగ్గా అలాంటిదే కానీ ఇది భిన్నమైంది. ఇక ఊరించకుండా, ఊహల్లో విహరించకుండా విషయంలోకి వెళ్దాం పదండి.
ముందుగా మనం పారిస్‌లోని ఈఫిల్ టవర్ (Eiffel Tower) చూసేద్దాం.
⦁ గూగుల్ క్రోం (Google Crome) ఓపెన్ చేసి Eiffel Tower అని టైప్ చేయండి.
⦁ ఆ తర్వాత మ్యాప్స్ (Maps)పై క్లిక్ చేయండి.
⦁ ఇపుడు కుడివైపు కింది భాగంలో street viewపై క్లికి చేయండి
⦁ స్క్రీన్‌పై కనిపించే ఫొటోపై క్లిక్ చేస్తే ప్రత్యేకంగా బాణం గుర్తు కనిపిస్తుంది.
⦁ మౌస్తో బాణం గుర్తును ఒత్తి పట్టుకుని ఎటు కదిలిస్తే అటు దృశ్యాలను వీక్షించవచ్చు.
ఈ అనుభవం మనం అక్కడే ఉండి (Live) వీక్షిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మనసుకు కొత్త అనుభూతిని పంచుతుంది.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ గూగుల్ సెర్చ్ (Google Search) సుపరిచితమే. అయితే street view కొత్త అనుభూతిని కలిగిస్తుంది. వీధుల్లో నడుస్తూ వెళ్తున్న ఫీలింగ్ ఇది అందిస్తుంది.