మధుమేహం, క్యాన్సర్ వంటి సాంక్రామికేతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వచ్చే పదేళ్లలో దేశాలన్నీ 30 లక్షల కోట్ల డాలర్ల భూరి నష్టాన్ని భరించాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదించింది. నిరుడు అనూహ్యంగా విరుచుకుపడిన కొవిడ్ మహమ్మారి ఎన్నో యుద్ధాల పెట్టుగా ప్రాణ నష్టాన్ని ఆర్థిక అరిష్టాన్ని కలిగించిన నేపథ్యంలో భాగ్యనగర వేదికపై జరిగిన బయో ఆసియా సదస్సు- మారిన వాతావరణంలో ఔషధ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాల్ని లోతుగా చర్చించింది. వ్యక్తి స్థాయిలోను, ప్రభుత్వాలపరంగాను ఆరోగ్య సంరక్షణే తొలి ప్రాథమ్యంగా మారిన వేళ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత దన్నుగా జీవ శాస్త్రాల్లోని విభాగాలన్నీ జూలు విదిలించాల్సిన తరుణమిది. ప్రపంచ జనరిక్ ఔషధాల విపణిలో 20శాతం, టీకాల్లో 62 శాతం వాటాతో మేటిగా రాణిస్తున్న ఇండియా- స్వస్థ భారత్ లక్ష్యాలతోపాటు ప్రపంచానికే ఔషధశాలగా ఉనికిని సుస్థిరం చేసుకొనే వ్యూహాత్మక పరివర్తనకు సిద్ధం కావాలి.
ప్రైవేటు రంగంలోనూ..
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), కృత్రిమ మేధ, సెన్సర్ల వంటి అత్యధునాతన సాంకేతికత పురివిప్పి అందుబాటులోకి వస్తున్నందున ఆయా నమూనాల్ని సమన్వయీకరించుకొంటూ ఔషధ దిగ్గజాలు ముందడుగేయాల్సి ఉంటుంది. ఆ దిశగా పరిశోధన అభివృద్ధికి ప్రభుత్వాలు అండదండగా నిలవాల్సి ఉండగా- సంబంధిత వ్యయాలకు ఇచ్చే పన్ను ప్రోత్సాహకాల్లో కోతను బయో సదస్సు ప్రస్తావించింది. బయో లాజిక్స్‌లో చైనా, క్యాన్సర్ విభాగంలో అమెరికా పెద్దయెత్తున పరిశోధనలతో కొత్త మాలిక్యూల్స్‌ను ఆవిష్కరిస్తున్నాయంటూ, పరిశోధనలపై దేశీయంగా ప్రభుత్వ ఉదాసీనత మీద ఆవేదనా వ్యక్తమైంది. ఆరోగ్యరంగాన ఆత్మనిర్భరత కోసం నాలుగంచెల వ్యూహంతో ముందడుగేస్తున్నామన్న ప్రధాని మోదీ- ప్రతిబంధకాల్ని అధిగమిస్తూ లక్ష్యసాధన దిశగా స్థిరంగా సాగుతామని ప్రకటించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు ఇటీవలి బడ్జెట్లో అయిదేళ్ల కాలావధికి రూ.50వేల కోట్లు కేటాయించి, ఫార్మా రంగానికి రూ.15వేల కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ప్రకటించిన కేంద్రం- ప్రైవేటు రంగంలో పరిశోధనలకూ బాసటగా నిలవాలిప్పుడు!
మౌలిక సదుపాయాల్ని కల్పిస్తేనే..