తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2019, 6:40 AM IST

Updated : Dec 10, 2019, 7:38 AM IST

ETV Bharat / city

భాజపాకు తెరాస ఝలక్​..!

రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా లోక్​సభలో పౌరసత్వ సవరణ బిల్లును.. తెరాస వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై మైనారిటీల్లో అసంతృప్తి ఉండడం కూడా ఒక కారణంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

భాజపాకు తెరాస ఝలక్​..!
భాజపాకు తెరాస ఝలక్​..!

పౌరసత్వ సవరణ బిల్లును... తెరాస వ్యతిరేకించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశగమారింది. గత ఆరేళ్లలో కేంద్రం ప్రతిపాదించిన బిల్లును తెరాస వ్యతిరేకించడం, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్‌ జారీ చేయడం ఇదే తొలిసారి. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా తెరాస ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై మైనారిటీల్లో అసంతృప్తి ఉండడం కూడా ఒక కారణంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

విలీనంతోనే గొడవ ..?
2014 ఎన్నికల్లో కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీలో విలీనం చేయడంపై కేసీఆర్‌ మండిపడ్డారు. తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. రెండు పార్టీల మధ్య సామరస్య వాతావరణం కొనసాగింది.

రాష్ట్రంలో ప్రశంసించారు.. దిల్లీలో తిట్టారు..
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ బిల్లులకు తెరాస మద్దతునిచ్చింది. ప్రధాని మోదీ కూడా సీఎం కేసీఆర్‌ ఆహ్వానంపై రాష్ట్రానికి వచ్చి మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తర్వాత పార్లమెంటులో విభజన హామీలపై చర్చ సందర్భంగా కేసీఆర్‌ అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ఆపై పరిస్థితులు మారాయి.

ఆరోపణలు.. విమర్శలు

2018 శాసనసభ, 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో రెండు పార్టీలు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శించుకున్నాయి. అయినా ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులో ఆర్టీఐ సవరణ బిల్లుకు తెరాస మద్దతునిచ్చింది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు విషయంలో మాత్రం తటస్థంగా ఉంది. తాజాగా పౌరసత్వ బిల్లును వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది.

  • అసంతృప్తికి కారణాలెన్నో..?
  1. కొంతకాలంగా కేంద్రం వైఖరిపై తెరాస అసంతృప్తితో ఉంది. ప్రధాని, కేంద్రమంత్రులు హామీలను అమలు చేయకపోవడం, నిధులు ఇవ్వకపోవడం వంటి అంశాలను ఎత్తిచూపుతోంది.
  2. సీఎం కేసీఆర్‌ ఇటీవల స్వరాన్ని పెంచారు. రాష్ట్రానికి పన్నుల వాటా మినహా అదనంగా నిధులేవీ ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిర్వహించిన సమీక్షలోనూ.. కేంద్రం మాటలకు, చేతలకు పొంతన లేదని వ్యాఖ్యానించారు.
  3. దిల్లీలో ప్రధానిని కలుస్తామని వెళ్లిన సీఎం.. భేటీ కాకుండానే వెనక్కివచ్చేశారు. కేటీఆర్‌ సైతం ఇటీవల కేంద్రం పంథాపై ధ్వజమెత్తారు. రాష్ట్ర భాజపా నేతల విమర్శలను అధికార పార్టీ నేతలు గట్టిగా తిప్పికొడుతున్నారు.

మైనారిటీల కోణంలో..
పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమంటూ మజ్లిస్‌ దానిని వ్యతిరేకించింది. ఆ పార్టీ తెరాసకు మిత్రపక్షంగా ఉంది. రాష్ట్రంలో మైనారిటీలు కీలకంగా ఉన్నారు. త్వరలో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మైనారీటీలది ముఖ్యపాత్ర కానుంది. వారి మద్దతును సమీకరించేందుకు వీలుగా ఈ బిల్లును వ్యతిరేకించాలని తెరాస నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం.. మోదీ హర్షం

Last Updated : Dec 10, 2019, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details