Protest against YSRCP MLA: ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఘోర పరాభవం.. సొంత పార్టీ యువకులే నిలదీత
YSRCP youth protest against Chodavaram MLA Karanam: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా అధికార పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఘోరమైన పరాభవాలు ఎదురువుతున్నాయి. ఎక్కడికెళ్లిన ఆ ప్రాంత ప్రజలు ఊరి అభివృద్ధి కోసం ఏం చేశారు..?, యువతకు ఏం చేశారు..? జాబ్ క్యాలెండర్ ఏమైంది..? అంటూ నాయకులను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి తీవ్ర పరాభవం ఎదురైంది.
వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి పరాభవం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. ఈ నెల 21 తేదీన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఆయన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొండపాలెంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కొంతమంది యువకులు ఆయనను జాబ్ క్యాలెండర్ ఎక్కడ..? అంటూ నిలదీశారు. అయితే, ఆసక్తికర విషయమేమిటంటే.. సొంత పార్టీకి చెందిన యువకులే ఎమ్మెల్యేను ప్రశ్నించటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన మూడు రోజులక్రితం జరిగినప్పటికీ ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.
జాబ్ క్యాలెండర్ రాలేదు సాక్షి క్యాలెండర్ వచ్చింది.. ఆ వీడియోలో ఉన్న ప్రకారం.. 'కొంతమంది యువకులు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని.. అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని మాట ఇచ్చారు కానీ, ఇంతవరకూ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ సాక్షి క్యాలెండరు వచ్చింది. రాష్ట్ర విడిపోయింది మనకు అవ్వదు అంటున్నారు కదా.. ఖాళీగా ఉన్న పోస్టులతో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు కదా.. ఇప్పటికీ నాలుగేళ్లు అయిపోయింది. ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికీ చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి. మన దగ్గర ఉద్యోగాల ఊసే లేదు.' అంటూ యువకులు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని, పోలీసు అధికారులను ప్రశ్నించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. కరోనా వల్లే ఆలస్యమైందంటూ సమాధానం చెప్పడంతో తెలంగాణలో కరోనా రాలేదా అంటూ గ్రామస్థులు, యువకులు నిలదీశారు.