నేత్రపర్వం.. ఒంటిమిట్ట కోదండ రాముడి చక్రతీర్థం
Ontimitta Kodanda Ramaswamy Brahmotsavam updates: వైఎస్సార్ జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 30వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు 10 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరామ నవమి పురస్కరించుకుని.. ఎనిమిది రోజులపాటు అంగరంగా వైభవంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు.. ఏప్రిల్ 9వ ముగియనున్నాయి.
ఒంటిమిట్ట కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం (చక్ర తీర్థం) నేత్రపర్వంగా సాగింది. శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు విచ్చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ముందుగా ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధనను నిర్వహించారు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో శ్రీ లక్ష్మణ సమేతగా స్వామివారు తిరుచ్చి, సుదర్శన చక్రత్తాళ్వార్ పల్లకిలో వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత 10.30 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అంగరంగా వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు... పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో పంచామృతాభిషేకం అందుకున్నారు. చివరగా అర్చకుల వేదమంత్రాల ఉచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణంతో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.