Roads in Nellore: చెరువులా..! నెల్లూరు రహదారులా..? రోడ్లపై మడుగులో కూర్చుని టీడీపీ నేతల నిరసన
TDP Leaders Protest for Roads: నెల్లూరులో రహదారులు నరకప్రాయంగా మారాయి. ప్రధాన రహదారి సైతం అధ్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలోని వేదయపాలెం సెంటర్ వద్ద రహదారి చెరువును తలపిస్తోంది. నగరంలోని కేశవులనగర్ రహదారికి మరమ్మతులు చేపట్టాలని వరదనీటిలో తెలుగుదేశం నేతలు నిరసన చేపట్టారు. గుంతలమయమైన దారిలో నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేలాది మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తారు. గత ఎనిమిది నెలలుగా రహదారి గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8నెలలుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై గుంతల్లో మోకాళ్ల లోతులో వర్షపు నీరు చేరిందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ మార్గంలోనే తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.