నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటూనే జగన్ అందరినీ సర్వనాశనం చేశారు - బీసీలకు మేలు చేసింది టీడీపీనే : టీడీపీ బీసీ నేతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 18, 2023, 11:03 PM IST
TDP BC Round Table Samavesam Updates:తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం బీసీ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 'నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు' అంటూ ముఖ్యమంత్రి జగన్ అందరినీ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. బీసీలకు మేలు చేసింది తెలుగుదేశం పార్టీనేనని, వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
TDP Leaders Comments: ''చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం బీసీ శాఖ ఏర్పాటు చేయాలి. జనాభాలో 70 శాతం ఉన్నా బీసీలు..సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడే ఉన్నారు. బీసీల మేలు, వారి సమస్యల పరిష్కారం కోసం టీడీపీ మ్యానిఫెస్టోలో పలు అంశాలు చేర్చుతాం. దాంతోపాటు టీడీపీ అధికారంలోకి రాగానే ఆదరణతో పాటు బీసీలకు సంబంధించిన పథకాలు అమలు చేస్తాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ముఖ్యమంత్రి జగన్..ఆయా వర్గాలను నాశనం చేశారు. బీసీలను అక్కున చేర్చుకున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే. అధికారంలోకి వస్తే బడుగులకు లబ్ది చేకూర్చే పథకాలు అమలు చేసేది ఆయనే. బీసీల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించాలి.'' అని సమావేశంలో పాల్గొన్న టీడీపీ నేత యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు పిలుపునిచ్చారు.