Annamacharya Jayanti: వైభవంగా శ్రీవారి కల్యాణం.. నేటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు
Tallapaka Annamacharya Jayanti celebrations Updates: 'పద కవితా పితామహుడు'గా ప్రసిద్ధిగాంచిన తాళ్లపాక అన్నమాచార్యుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు. ఆయన తన జీవిత కాలమంతా శ్రీ వేంకటేశ్వర స్వామి కైంకర్యానికి అంకితం చేశారు. అన్నమయ్య..శ్రీ వేంకటేశ్వర స్వామి రచించిన పదాలు అనంత భక్తిభావ పరిమళాలు అంటారు భక్తి తత్పరులు. ఆయన రచించిన సంకీర్తనల్లో అన్ని రకాల భావనలను రంగరించి రచించారు. అందులో కొన్ని మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని వేదాంత ధోరణిని, యోగసిద్ధిని, ఆత్మానందాన్ని, సామాజిక స్పృహను కలిగింపజేస్తాయి. అన్నమయ్య పదాల్లో.. ముఖ్యంగా తిరుమల శ్రీవారి వైభవం, తిరుపతి క్షేత్రమాహాత్మ్యం, ఉత్సవాలు, భక్తుల దివ్య చరిత్రలు మొదలైన ఎన్నో అంశాలు ఆయన ప్రస్తావించారు. నేడు ఆయన 615వ జయంతిని పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వేడుకగా శ్రీవారి కల్యాణం..శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు అన్నమయ్య ధ్యానమందరంలో శ్రీవారి కల్యాణం వేడుకగా జరిగింది. శ్రీవారి కల్యాణాన్ని టీటీడీ వేద పండితులు శాస్త్రోప్తంగా వేద మంత్రచనాలతో నిర్వహించారు. అయితే, ఉత్సవాలకు సంబంధించి అధికారులు ఎటువంటి ప్రచారం చేయకపోవడంతో భక్తులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. టీటీడీ ఆహ్వానం మేరకు శ్రీవారి కల్యాణానికి ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు.. మరోవైపు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలోని శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలు నేటి నుండి మూడు రోజుల పాటు టీటీడీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరగనున్నాయి. అందులో ముఖ్యంగా నాదస్వర సమ్మేళనం, సప్తగిరి సంకీర్తన గోష్టిగానం, సంగీత సభలు, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలైనా సంగీత, నాటక, హరికథ కార్యక్రమాలను జరుగనున్నాయని వెల్లడించారు. అన్నమాచార్య జయంతి ఉత్సవాలకు సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లోనూ, తాళ్లపాక గ్రామంలోనూ ఎటువంటి గోడ పత్రాలు కానీ, ప్రచార కార్యక్రమాలు గానీ నిర్వహించకపోవడంతో శ్రీవారి భక్తులు ఆవేదన చెందారు.