Canal Captured: మట్టి పోసి కాలువ కబ్జాకు రియల్టర్ యత్నం.. అడ్డుకున్న గ్రామస్థులు - real estate businessman occupied canal
Real Estate Businessman captured Canal: రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోజురోజుకు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూములు వారి కళ్లల్లో పడితే చాలు.. వాటిని ఆక్రమించుకుని సొత్తు చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లాలో ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి చెరువులోకి నీళ్లు తీసుకువెళ్లే కాలువను ఆక్రమించటానికి ప్రయత్నించాడు. కాలువను పూడ్చి ఆక్రమించుకోవాలని చూశాడు. కానీ, గ్రామస్థులు అడ్డుకుని అతని పన్నాగాన్ని నిర్వీర్యం చేశారు.
నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామ చెరువుకు.. వరద నీటిని తీసుకువచ్చే పెద్ద కాలువను రియల్ ఎస్టేటర్ ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. కాలువలో మట్టిపోసి ఆక్రమించాలని.. అందులోకి మట్టిని తరలించాడు. విషయం తెలుసుకున్న ఉడుములపాడు గ్రామస్థులు, సీపీఐ నాయకులు.. కాలువలో పోసిన మట్టిని పొక్లెయిన్ సహాయంతో తొలగించారు. ఈ కాలువ ఎన్నో సంవత్సరాలుగా చెరువుకు నీటిని చేర వేస్తోందని.. చెరువుపై ఆధారపడి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నామని గ్రామస్థులు అన్నారు. కాలువను ఆక్రమిస్తే చెరువులోకి నీరు రాదని తెలిపారు. గ్రామస్థులు కాలువలో మట్టిని తొలగిస్తున్న సమయంలో స్థానికంగా ఓ నాయకుడు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. గత కొన్ని సంవత్సరాలు చెరువులోకి నీరు ఇలాగే వెళ్తొందని ఇప్పుడేలా అడ్డుకుంటారని గ్రామస్థులు ప్రశ్నించారు.