Power Employees Protest: ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె.. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల అల్టిమేటం - Power Employees Protest
AP Power Employees Protest: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తిరుపతి ఏపీఎస్పీసీడీసీఎల్ కార్యాలయం నుంచి ఎమ్మార్ పల్లి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలోని పాతూరు పవర్ ఆఫీసు నుంచి టవర్‌క్లాక్ వరకు విద్యుత్ ఉద్యోగుల భారీ ర్యాలీ చేశారు. కర్నూలులో విద్యుత్ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డు నుంచి ఏపీఈఓపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వరకు విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఎస్సీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. మరో వైపు నిన్న విజయవాడలో విద్యుత్ ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. మరో దఫా చర్చల్లో సానుకూల స్పందన రాకుంటే ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మె తప్పదని విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు స్పష్టం చేశారు. యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని విజయవాడలో ఐకాస నేతలు ఆవేదన చెందారు.
చర్చలు విఫలం: విద్యుత్ సంస్థలతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. మరో దఫా చర్చలు జరుపుతామంటూ యాజమాన్యం చేసిన ప్రకటనలో సానుకూల స్పందన రాకుంటే ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె తప్పదని విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు స్పష్టం చేస్తున్నారు. ఐదు గంటలపాటు విజయవాడ గుణదలలో యాజమాన్యంతో జరిగిన చర్చలు అసంపూర్ణంగా నిలిచిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యాజమాన్యం మొండి వైఖరి కనబరుస్తోందని ఆవేదన చెందారు. తమ దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రేపు, ఎల్లుండి రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తోన్న ఏ ఆసుపత్రికి వెళ్లినా తమకు పరిమితి లేని వైద్య విధానాన్ని అమలు చేయాలని తాము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సేవలను క్రమబద్ధీకరించాలని.. ఎనర్జీ అసిస్టెంట్‌లను తమతోపాటు సమానంగా ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నాలుగేళ్ల నుంచి దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలపై నిరీక్షిస్తూనే ఉన్నామని.. గతనెల 27వ తేదీన 12 ప్రధాన డిమాండ్లతో నోటీసులు ఇచ్చామని తెలిపారు.