Amanchi Swamulu to Janasena: 'జనం బాగుండాలంటే.. జగన్ పాలన పోవాలి' - Amanchi Swamulu joined janasena
Parchur YSRCP incharge Amanchi brother joined the JanaSena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆమంచి శ్రీనివాసులు(స్వాములు) ఈరోజు జనసేన పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయానికి.. అభిమానులతో, కార్యకర్తలతో భారీ ర్యాలీగా విచ్చేసిన ఆమంచి శ్రీనివాసుల్ని పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు.
జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమంచి శ్రీనివాసులు.. ఆమంచి శ్రీనివాసులు(స్వాములు) మాట్లాడుతూ..''ఈ పండుగ వాతావరణంలో నేను జనసేన పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. జనసేన పార్టీ అంటే బడుగు, బలహీనవర్గాల పార్టీ. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పార్టీ. పేద ప్రజలకు కొండంత అండగా ఉండే పార్టీ. ఇటువంటి పార్టీలో చేరాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అందరం ముందుడుగు వేద్దాం. పవన్ కల్యాణ్‌కు కొండంత అండగా ఉందాం'' అని అన్నారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనం బాగుండాలంటే జగన్ పాలన పోవాలన్నారు. పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేనలో చేరటం శుభపరిణామన్నారు. ఆమంచి శ్రీనివాసులను మనస్పూర్తిగా జనసేనలోకి ఆహ్వానిస్తున్నానని.. కార్యకర్తలకు కష్టం వస్తే తాను ఉన్నానని నిలబడే వ్యక్తే నాయకుడన్నారు. స్వాములు రాకతో ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో జనసేనకు మరింత బలం పెరిగిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.