సీఎం జగన్‌కు 'ఇది తప్పు' అని చెప్పే సలహాదారులే లేరు: ఎమ్మెల్సీ రామచంద్రయ్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 5:01 PM IST
MLC Ramachandraiah Comments: రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చూసి వైసీపీ ప్రభుత్వంలో ఇమడలేకే బయటకు వచ్చానని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. గత కొంతకాలం నుంచి తనలో తాను మదనపడుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నడిపించగల ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు కావడంతో తిరిగి టీడీపీలో చేరానని రామచంద్రయ్య తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడే పరిస్థితి రాష్ట్రంలో లేదన్న రామచంద్రయ్య, వైసీపీ పాలనలో నాయకుల మాటలు వినే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌కు ఇది తప్పు అని చెప్పే సలహాదారులే లేరని, ప్రజల ఆకాంక్షల మేరకు పాలన లేదన్నారు.
మరో మూడేళ్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవికి త్వరలో రాజీనామా చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని సైతం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను జగన్మోహన్ రెడ్డికి వివరించేందుకు చాలా సార్లు ప్రయత్నం చేశానని కానీ తనకు అవకాశం రాలేదని తెలిపారు. జగన్ కేవలం ముగ్గురు లేదా నలుగురి మాటలు మాత్రమే విని, వారు చెప్పిన ప్రకారమే నడుచుకుంటారని విమర్శించారు.