Minister Botsa On Toefl : ఇంటర్నేషనల్ సిలబస్‌పై 'సెలబ్రిటీ పార్టీ' నాయకులకు అవగాహన లేదు : మంత్రి బొత్స
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 4:12 PM IST
|Updated : Oct 20, 2023, 8:04 PM IST
Minister Botsa On toefl : విద్య కూడా తమ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశమేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలకు అందివ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు. ట్యాబ్‌లు, బైజుస్ కంటెంట్ ఇస్తున్నట్లే.. టోఫెల్ కూడా అందిస్తున్నట్లు వివరించారు. వీటన్నిటి పైనా కొందరు ఇష్టారాజ్యంగా.. ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ బాక్యులారెట్ సిలబస్ పైనా సెలబ్రిటీ పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందులో దోచుకోవడం ఎక్కడుందని నిలదీశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతతో కూడిన విద్య అందిస్తే ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. పేదలు అంటే సెలబ్రిటీ పార్టీకి అంత వ్యతిరేకత ఎందుకని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం - ఇంటర్నేషనల్ బాక్యులారేట్ సంస్థతో ఒప్పందం చేసుకుని సంయుక్తంగా సర్టిఫికేషన్ జారీ చేయాలని అనుకున్నామని వెల్లడించారు. ఇందులో 4 వేల కోట్ల కుంభకోణం అంటున్నారని... పేద విద్యార్థులకు ఉన్నత స్థాయిలో విద్య అందించటం ప్రభుత్వ తప్పా..? అని ప్రశ్నించారు. టోఫెల్‌కు 2027 వరకూ రూ.145 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రతిపక్షాల ఉద్దేశం ఏమిటో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని విమర్శించారు.
ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆర్థిక శాఖ అధికారులు వ్యతిరేకించినట్టు మాట్లాడుతున్న కొందరికి... తమ ప్రభుత్వంలో అన్నీ పారదర్శకంగా జరుగుతున్నట్టు తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. టోఫెల్ లో టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థ సామాజిక బాధ్యత గా ముందుకు వచ్చిందన్నారు. ఏపీ విద్యార్థి ప్రపంచం తో పోటీపడాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఐబీ సిలబస్ అమలు కోసం ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని.., ఇందులో ఎక్కడా ఆర్థికపరమైన అంశాలు మాట్లాడుకోలేదని వివరించారు. టోఫెల్, ఐబీ లాంటి సంస్థ లు అత్యుత్తమం అని తాము భావిస్తున్నందునే...., ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతీ ఒక్క అంశానికి టెండర్ లకు వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇది కేవలం విజ్ఞాన పరమైన సేవలు అందించే సంస్థలు కాబట్టి తమ ప్రభుత్వం వాటి తో ఒప్పందం కుదుర్చుకుందని స్పష్టం చేశారు.