భూ యాజమాన్య హక్కు చట్టాలతో అధికార పార్టీ నేతలకే న్యాయం - ఆందోళన తీవ్రతరం చేస్తామని లాయర్ల హెచ్చరిక - Lawyers criticize the government
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 5:08 PM IST
Lawyers Protest in Kurnool District :భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కర్నూలులో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజు కొనసాగుతోంది. ఈ చట్టం వల్ల సివిల్ కోర్టులకు భూ తదాగాల కేసులు విచారించే అవకాశం లేదని తెలిపారు. వీటిని రెవెన్యూ ట్రిబ్యునల్స్ మాత్రమే పరిష్కరించనున్నాయని లాయర్లు గుర్తు చేశారు. చివరికి దీని వల్ల అధికార పార్టీ నేతలకే న్యాయం లభిస్తుందని తెలిపారు. సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని స్పష్టం చేశారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు అనుకూలమైన చట్టాన్ని రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం- 2022 ని నిరసిస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు, రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుందని న్యాయవాదులు మండిపడ్డారు. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ఈ చట్టంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు స్పందించకపోవడం దారుణమన్నారు. భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు న్యాయవాదుల పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.