చేపల వేటకు డీజిల్ కష్టాలు.. రాయితీ అందక ఆందోళనలో మత్స్యకారులు - మత్స్యకారుల కష్టాలు
Visakha Fishing Harbor: మూలిగే నక్క మీద తాటి పండు పడిన చందంగా ఉంది విశాఖలో ఫిషింగ్ జెట్టీలో బోట్ ఆపరేటర్ల పరిస్థితి. ఇప్పటికే వేట సరిగా లేక, ఆదాయం రాక, కొట్టు మిట్టాడుతున్నచేపల వేట మీద డీజిల్ రాయితీ పిడుగు పడింది. అమావాస్యకో పున్నమికో వచ్చే డీజిల్ సబ్సిడీ రాక, ఇచ్చిన డీజిల్ స్మార్ట్ కార్డులు పనిచేయక వేటలు ఆపి బోటులను జెట్టికి పరిమితం చేసారు. మళ్లీ ఎపుడు ప్రభుత్వం డీజిల్ రాయితీ సొమ్ము ఇస్తుందో అప్పటి వరకు వేట చేయలేమని చెప్తున్నారు బోట్ యజమానులు. ఒక్కో బోట్ మీద కనీసం పది మంది పని చేస్తారు.
సుమారు 15 వందల బోట్లు ఉండగా 80 శాతం బోట్లు జెట్టీలోనే నిలిపి వేశారు. డీజిల్ రాయితీ రాకపోయినా, బోట్ సిబ్బంది బతుకు తెరువు కోసం ఆలోచించి వేటకు వెళ్లిన వారికీ నష్టం చవి చూస్తున్నారు. ఫలితంగా వేట చేయడానికి ఎవ్వరు సాహసం చేయడం లేదు. డీజిల్ రేట్ 100 చేరినా సరే లీటర్కు 9 రూపాయల 10 పైసలు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోందని బోట్ యజమానులు చెప్తున్నారు. అది కూడా అప్కోస్ జీతాలు కోసం 1 రూపాయి 10 పైసలు, రాష్ట్ర రోడ్ల సెస్ కింద మరో కొంత కోత పెట్టి చివరికి 7 రూపాయల 50 పైసలు వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
ఆ రాయితీ సొమ్ములు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతన్నారని చెప్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ రాయితీ బకాయి చెలింపులో ఆలస్యం చేయడం వల్ల ఆయిల్ కంపెనీలు రాయితీ డీజిల్ ఇవ్వడం లేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. విశాఖ ఫిషింగ్ హుర్బోర్ లో మత్స్య కారుల సమస్యపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు.