ఎండిపోతున్న వరినారు - నీటిని విడుదల చేయాలని రైతుల ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 12:27 PM IST
|Updated : Dec 14, 2023, 12:44 PM IST
Farmers Concern To Release Irrigation Water For Crops: సోమశిల దక్షిణ కాలువ నుంచి తమ పొలాలకు నీటిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెళ్లటూరు గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ కాలువ నుంచి 5ఎల్ వరకు నీటిని అధికారికంగా ప్రకటించారు కానీ సాగు నీరు మాత్రం విడుదల చేయటంలేదు. 50 లక్షల రూపాయలు విలువచేసే వరి విత్తనాలు తెచ్చి 6ఎల్ కింద నారు పోయటం జరిగిందని రైతులు తెలిపారు. ఇపుడు దానికి సాగునీరు లేక నార్లు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 6ఎల్ కాలువ పరిధిలో 1500 ఎకరాలు సాగుభూమి ఉండగా, 5ఎల్ కాలువ వరకే సాగు నీటిని కేటాయించడం దారుణమన్నారు.
దక్షిణ కాలువకు ఒక్క టీఎంసీ నీటినే కేటాయించి ఆయకట్టు రైతులకు అధికారులు అన్యాయం చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు గ్రామంలోని దక్షణ కాలువ 6ఎల్కు నీటిని విడుదల చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఉపయోగం లేకపోయిందని అవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నీటిని విడుదల చేయకపోతే ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరించారు.