సోమశిల నీటిని విడుదల చేసి పైరు కాపాడాలి - కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 12:44 PM IST
Farmers Asked to Release Somasila Water: వరి పొలాలకు సాగునీరు ఇచ్చి అదుకోవాలంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆయకట్టు రైతులు స్థానిక ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఆయకట్టు చెరువుకు సోమశిల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేసి కాపాడాలంటూ ఇరిగేషన్ అధికారులను రైతులు అభ్యర్థించారు. మూడేళ్లుగా తమ పొలాలకు సాగునీరు అందక పంటలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కావాల్సిన సాగునీరును అందించేందుకు ఇరిగేషన్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
జలాశయం నుంచి వస్తున్న నీటిని తమ పొలాలకు విడుదల చేస్తే సాగు చేసుకుంటామని రైతులు చెబుతున్నారు. సోమశిల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయకపోతే దాదాాపు 600 ఎకరాల నష్టపోయే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ విషయం గురించి చర్చించేందుకే అధికారులను కలిశామని రైతులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నీరు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరారు.