వేసవి రాకముందే తాగునీటి ఇక్కట్లు - గంటల తరబడి బారులుదీరిన ప్రజలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 3:58 PM IST
Drinking Water Problems at Kanigiri: ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య వేధిస్తోంది. గుక్కెడు నీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోవటంతో స్థానికులు అవస్థలు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో సాగర్ నీళ్ల సరఫరా నిలిచిపోయింది. కనిగిరి మున్సిపాలిటీతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాలకు ఇక్కడి నుంచే నీటి సరఫరా జరుగుతుంది. ప్రధాన వాటర్ ట్యాంక్ వద్ద రెండు కుళాయిలలో మాత్రమే తాగునీరు వస్తుండటంతో ప్రజలు బారులు తీరారు.
Scarcity of Water: కొంతమంది నీటి కోసం లీకుల ద్వారా అరకొరగా వస్తున్న నీటిని పట్టుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఓ బిందెడు మంచినీరు దొరికితే వాటినే వడపోచి తీసుకెళ్తున్నారు. మున్సిపాలిటీ నుంచి ఎన్నో గ్రామాలకు సరఫరా చేసే ప్రధాన సాగర్ వద్దనే ఇలాంటి దుస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సకాలంలో త్రాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.