తాగునీటి కోసం చందాలు వేసుకున్న ప్రజలు - గ్రామంవైపు కన్నెత్తి చూడని అధికారులు - Drinking water problems
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 1:31 PM IST
Drinking Water Problem in Nandyala District : నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామంలో వారం రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు వాపోయారు. తాగునీరు అందించే మెటారు విద్యుత్తు తీగలు కాలిపోవడంతో వారం నుంచి తాగునీరు రాలేదన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో నిధులు లేకపోవడంతో గ్రామస్తులు సొంతంగా చందాలు వేసుకొని తాత్కాలిక మరమ్మతులు చేసుకున్నారు. తరచూ తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నా శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో అందరూ కలిసి చందాలు వేసుకొని తాత్కాలిక మరమ్మతులు చేసుకున్నా కనీసం ఇప్పుడైన అధికారులు ఇటువైపు చూడటం లేదని మండిపడ్డారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా కుటుంబమంతా బిందెలతో నీటిని తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు మా గ్రామానికి వస్తారని, సమస్యలు ఉన్నప్పుడు కనీసం గ్రామం వైపు కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.