ప్రజల సమస్యలను పట్టించుకోని సీఎం తప్పుకోవాలి - సీపీఐ రామకృష్ణ ధ్వజం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 10:39 PM IST
CPI Ramakrishna Fires on CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళనాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. సరైన పాలన చేసి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఖాళీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల పట్టించుకోని సీఎం తక్షణం పదవి నుంచి తప్పుకుంటే మేలని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
ఒక వైపు అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే మరొక వైపు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారన్నారు. వారి సమస్యలపై చర్చించాల్సిన సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలు, ఎంపీలను బదిలీ చేసే పనిలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.
రుషికొండను బోడి గుండు చేసి సీఎం కార్యాలయం పేరుతో 451 కోట్లతో భవనాలు కడుతున్న జగన్కు అంగన్వాడీలకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. సీఎం జగన్ తక్షణం పదవి నుంచి తప్పుకుని సీనియర్ మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలో ఎవరికైనా పదవి అప్పగిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగైనా కనీసం వారి సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు మార్గం సుగమం అవుతుందని రామకృష్ణ అన్నారు.