CBN: మళ్లీ శంకుస్థాపనలు.. ఇవేం తిక్క పనులు జగన్: చంద్రబాబు - ఏపీ ముఖ్యవార్తలు
Chandrababu Naidu Press Meet : ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఓ పద్ధతి, సంప్రదాయం లేకుండా తిక్క పనులు చేసినపుడు ఎవరైనా సరే.. ఈ రాష్ట్ర ప్రజలంతా తిక్కవాళ్లే అనుకుంటారు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకే సీఎం జగన్ మళ్లీ శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అదానీ డాటా సెంటర్, భోగాపురం ఎయిర్ పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు టీడీపీ హయాంలో ఐదేళ్ల కిందటే శంకుస్థాపన చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆసియాలోనే అతి పెద్దదైన కర్నూలు సోలార్ పార్క్‌ను కూడా మళ్లీ ప్రారంభించడాన్ని ఏమని అనుకోవాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు భోగాపురంలో ఎయిర్ పోర్టు ఎందుకని ప్రశ్నించి భూసేకరణకు అడ్డుపడిన జగన్.. ఇవాళ అదే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయడాన్ని ఏమనుకోవాలి అని ప్రశ్నించారు. వీళ్లసలు మనుషులా, రాక్షసులా, వింత జంతువులా..! నాకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. తాను సైబరాబాద్ నిర్మాణం చేపట్టినపుడు జగన్ గోళీలు ఆడుకుంటూ ఉండొచ్చు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని.. యువత మేల్కొవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.