Caste Census in AP: ఏపీలో కులగణనపై అధ్యయన కమిటీ.. నివేదికపై సూచనలు - కులగణనపై అధ్యయన కమిటీ నియామకం
Caste Census in AP: కులగణన ప్రక్రియ విధానం రూపకల్పనకు అధ్యయన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న కులగణన ప్రక్రియపై అధ్యయనం చేసి ఏపీలో ఆ ప్రక్రియ అమలుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కులగణనకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు అధ్యయనం కమిటీని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణాళికా విభాగం కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయకుమార్ కన్వీనర్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించారు. మైనారిటీ, వెనుకబడిన తరగతులు, గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ, గ్రామవార్డు సచివాలయ కార్యదర్శులు సభ్యులుగా నియమించారు. కులగణన జరుగుతున్న రాష్ట్రాలను సందర్శించి అధ్యయనం చేయాల్సిందిగా కమిటీకి సూచనలు జారీ చేశారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే కులగణన చేపట్టారని.. కులగణన ప్రక్రియలో మార్పుచేర్పులు చేసి ఇక్కడ కూడా ఆ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై నివేదిక రూపొందించి మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించాలని సూచించింది.