MP Tractors Distribution: రాయితీపై రైతులకు ట్రాక్టర్లు.. వెయ్యి మందికి ఇస్తామన్న ఎంపీ కేశినేని నాని - MP Keshineni Nani distributed tractors to farmers
MP Kesineni Nani distributed tractors to farmers: విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు సబ్సిడీపై 25 ట్రాక్టర్లను రైతులకు అందజేశారు. అనంతరం వ్యవసాయ యాంత్రీకరణ ద్వారానే రైతులు లాభపడతారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది రైతులకు.. ట్రాక్టర్లు అందజేస్తామన్న ఆయన.. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ట్రాక్టర్లు కావాల్సిన రైతులు.. పొలానికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలను తీసుకొస్తే.. రాయితీపై ట్రాక్టర్లు అందజేస్తామన్నారు. ఈ క్రమంలో రైతుల కోసం వివిధ ట్రాక్టర్ల కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి, వారిని ఒప్పించి.. భారీ డిస్కౌంట్‌తో ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని నాని కృషిని తెలుగుదేశం పార్టీ నేతలు అభినందించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ..''టీడీపీ ప్రభుత్వ హయాంలో 'ఎన్టీఆర్ రైతు రథాల' పేరుతో చంద్రబాబు నాయుడు భారీ డిస్కౌంట్‌తో రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఇప్పుడు అదే మాదిరి వివిధ ట్రాక్టర్ల కంపెనీలతో మాట్లాడి.. వారిని ఒప్పించి, రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ట్రాక్టర్లను రైతులకు ఇచ్చేందుకు కంపెనీల యాజమాన్యాలు ముందుకొచ్చాయి. ఈరోజు మొదటి విడతగా 25 ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేశాము. రైతులకు వ్యవసాయం నిమిత్తం ట్రాక్టర్ కావాలంటే పొలానికి సంబంధించిన పాసు పుస్తకాలు తీసుకొస్తే.. భారీ డిస్కౌంట్‌తో ట్రాక్టర్లను అందజేస్తాం'' అని ఆయన అన్నారు.