ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్షీణిస్తున్న ధరలతో పసుపు నేల చూపు - కరోనాతో తగ్గిన పసుపు పంట రేట్లు

రైతులు ప్రతి పంటనూ ఇష్టంగా, శ్రద్ధతో సాగుచేస్తారు. అయితే పసుపు పంట మీద ఇంకొంచెం మమకారం ఎక్కువ. రేటు ఉన్నా లేకపోయినా కనీసం సెంటు భూమిలోనైనా పసుపును సాగుచేసేవారున్నారు. అలాంటి పంట నేడు నేలచూపులు చూస్తోంది. ఏటికేటా ధర తగ్గిపోతుండగా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ధరలు మరింత క్షీణిస్తున్నాయి. ఏడాది పాటు కష్టపడి సాగుచేసిన పసుపు.. రేటు లేక అన్నదాతలను కన్నీళ్లు పెట్టిస్తోంది.

yellow crop farmers facing troubles due to corona and declining prices
పసుపుపంట

By

Published : Apr 23, 2020, 6:33 PM IST

మమకారంతో పసుపు సాగు చేసి ఆరుగాలం శ్రమించి పండించిన బక్క రైతుల బతుకులు ఎండబారి పోతున్నాయి. ధరలు పతనమై కర్షకుల కలలు కరిగిపోతున్నాయి. కడప జిల్లాలో గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో 33 మండలాల్లో సుమారు 10,487.65 ఎకరాల్లో పసుపు పంట సాగు చేశారు. సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో విస్తారంగా వేశారు. మైదుకూరు మండలంలో అత్యధికంగా 2,446.55 ఎకరాల్లో సాగుచేయగా.. దువ్వూరు, ఖాజీపేట, చాపాడు, చింతకొమ్మదిన్నె, ఒంటిమిట్ట, సిద్దవటం, పోరుమామిళ్ల, పుల్లంపేట, మైలవరం, జమ్మలమడుగు, పెండ్లిమర్రి, కాశినాయన, నందలూరు, చెన్నూరు, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు, రాజుపాలెం, వల్లూరు, ప్రొద్దుటూరు, కలసపాడు, చిట్వేలి, బ్రహ్మగారిమఠం మండలాల్లోనూ పంట సాగుచేస్తున్నారు. నెలరోజులుగా పసుపు తవ్వకం పనులు జరుగుతున్నాయి. పచ్చి కొమ్ములను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తే చూపడం లేదు.

కరోనా ఎఫెక్ట్

పసుపు చేలల్లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఏటా వందలాది లారీల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి మహారాష్ట్రకు తీసుకువచ్చి పసుపును విక్రయించేవారు. ఇప్పుడు కరోనా కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వారాల కిందట పుట్టి ధర (270 కిలోలు) రూ.2,800 పలికింది. ప్రస్తుతం రూ.1,800 పలుకుతుంది. ఆ ధరకూ కొనేవారు రావడం లేదు. ‘మార్కెట్లో పసుపు ధరలు క్రమేణా పతనం కావటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. క్వింటా ధరకు రూ.6,850 చెల్లించాలని ప్రభుత్వం సూచించినా కరోనా అడ్డుగా నిలచింది. ‘పసుపును కొనుగోలు చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒక్కో రైతు నుంచి 30 క్వింటాళ్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలో సేకరణ కేంద్రాలు ప్రారంభిస్తా’మని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ బి.సుమంత్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి.. చెట్లకే మాగిపోతున్న మామిడికాయలు

ABOUT THE AUTHOR

...view details