కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మాజీమంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రాముడు విచారణకు హాజరు కావాలని కడప జిల్లా చిన్నచౌక పోలీసులు నోటీసులు పంపారు. ఇదివరకే నోటీసులు జారీ చేసినా.. స్పందించకపోవడం వల్ల రెండోసారి నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కుట్రను కడప చిన్నచౌక పోలీసులు మార్చి 21న భగ్నం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయడానికి 50 లక్షల రూపాయలకు సుఫారి తీసుకున్నట్లు పోలీసు విచారణలో నిందితులు అంగీకరించారు. ఈ కుట్ర కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు... వారి వెనకున్న వారిపై కూపీ లాగుతున్నారు. ఈకేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ వ్యక్తిగత సహాయకుడు మాదాల శ్రీనివాసులను సైతం కడప పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిచ్చిన సమాచారం మేరకు.. సీఆర్పీసీ 41 కింద నోటీసులు పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.