చిన్న వర్షానికే నీరు చేరి కడప జిల్లా కమలాపురం క్రాస్ వద్ద ఉన్న పైడిమాన్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 10 ఏళ్లకుపైగా 20 కుటుంబాలు ఇక్కడ గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. వానాకాలమొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిందేనని వాపోతున్నారు.
రాయచోటి నియోజవర్గంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. రామాపురం మండలం సుద్ధమల్ల గ్రామంలో నీట మునిగిన వరి పంటను పరిశీలించారు. కోత దశలో వర్షపు నీటిలో మునిగిపోయి పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ఆయనను కోరారు.
చెన్నముక్కపల్లి గ్రామంలో నీట మునిగిన వేరుశనగ, వరి, కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు నియోజకవర్గంలో వర్షానికి భారీగా పంట నష్టం జరిగిందని.. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూశారని అధికారులను అభినందించారు.