ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప విమానాశ్రయంలో రాత్రివేళలో విమానాల ల్యాండింగ్‌

కడప విమానాశ్రయంలో రాత్రిపూట కూడా విమానాలు దిగేలా రన్‌వేను విస్తరించాలని... ఇందుకు 47 ఎకరాలను సేకరించి విమానాశ్రయ సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. సమీపంలోని బుగ్గవంక ప్రాంతంలో ఇప్పటికే 7 కిమీ భద్రత గోడ నిర్మించగా, మిగిలిన 3 కిమీ నిర్మాణంతోపాటు రోడ్లు, మురుగు నీటి వ్యవస్థకు అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

cm cadapa
cm cadapa

By

Published : Dec 15, 2020, 9:51 AM IST

సీఎం జగన్​ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ(పాడా)పై సమీక్షించారు. పులివెందులలోని ఏపీ - కార్ల్‌ సంస్థలో ఈ నెల 24న గుజరాత్‌ రాష్ట్రం ఆనంద్‌ ప్రాంతానికి చెందిన గ్రామీణ మేనేజ్‌మెంట్‌ సంస్థ (ఇర్మా)కు శంకుస్థాపన చేయనున్నట్లు జగన్‌ తెలిపారు.

‘గండి క్షేత్రం వీరాంజనేయస్వామి ఆలయంలో రూ.21 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి. 24 దేవాలయాల పునర్నిర్మాణంతోపాటు కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 26 ఆలయాలు నిర్మించాలి. పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, సీటీ సెంటర్‌, వధశాలల నిర్మాణం చేపట్టాలి. అన్ని లేఅవుట్లలో మంచినీరు, మురుగునీటి పారుదల పనులు పూర్తి చేయాలి. రింగ్‌రోడ్డును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి’ అని సీఎం సూచించారు.

వేంపల్లిలో రూ.92 కోట్లతో భూగర్భ మురుగునీటి పనులను ఆమోదించారు. ‘కీలకమైన ముద్దనూరు- కొడికొండ చెక్‌పోస్టు మార్గాన్ని జాతీయ రహదారి స్థాయిలో నిర్మించాలి. భూమిపూజ చేసిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలి. నాలుగు కీలక రహదారులను తొలిదశలో రూ.217 కోట్లతో అభివృద్ధి చేపట్టాలి. తొండూరులో బాలికల బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు, పులివెందుల, వేంపల్లిలో రైతుబజార్లు, పులివెందులలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణం, కడపలోని స్టేడియానికి ఫ్లడ్‌ లైటింగ్‌ వ్యవస్థ, కడప రైల్వేస్టేషన్‌, రిమ్స్‌ రోడ్ల అభివృద్ధి వెంటనే చేపట్టాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ పనులన్నీ ఒకేసారి కాకుండా దశల వారీగా చేపట్టాలని సూచించారు.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్టులో అధిక నీటి నిల్వ: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details