CM Jagan Delhi tour latest updates: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మరోసారి హస్తినకు పయనమవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి.. సాయంత్రం 5 గంటలకు దిల్లీకి చేరుకోనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ వరుస దిల్లీ పర్యటనలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం జగన్ పదేపదే ఎందుకు దిల్లీకి వెళ్తున్నారు..?, రాష్ట్రాభివృద్ది కోసమా..? లేక తన సొంత పనుల కోసమా..? అంటూ ప్రతిపక్షాలు పలు రకాల ప్రశ్నలను సంధిస్తున్నాయి. ఈ నెల 17వ తేదీనే దిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చిన జగన్.. ఈరోజు మళ్లీ ఎందుకు ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని కలవడానికి వెళ్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. సీఎం దిల్లీ పర్యటనలపై ప్రభుత్వం ఎటువంటి సమాధానాలు చెప్పకపోవడంతో ఏదో జరుగుతోందనే అనుమానాలను వ్యక్తం అవుతున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ప్రధాని, కేంద్ర హూంమంత్రితో జగన్ భేటీ: వివరాల్లోకి వెళ్తే.. సీఎం జగన్ నేడు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి ఆయన దిల్లీకి బయలుదేరి.. సాయంత్రం 5 గంటలకు దిల్లీకి చేరుకోనున్నారు. గురువారం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అవ్వనున్నారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ సాయంత్రమే ఉంటే రేపు రాత్రికే తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఒకవేళ భేటీ ఆలస్యమైతే రేపు (బుధవారం) రాత్రి దిల్లీలోనే బస చేసి గురువారం రోజున తాడేపల్లికి తిరిగి రానున్నారు.
అప్పుడు అసెంబ్లీ-ఇప్పుడు విశాఖ జీ-20 సదస్సు: ఈ క్రమంలో ఈ నెల (మార్చి) 16వ తేదీన సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలను పక్కనపెట్టి మరీ దిల్లీకి వెెళ్లి.. ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. ఇప్పుడు విశాఖలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సుకు వెళ్లినట్లే వెళ్లి.. మళ్లీ ఈరోజు దిల్లీకి బయలుదేరి గురువారం మధ్యాహ్నం ప్రధానిని, కేంద్ర హోంమంత్రితో మరోసారి సమావేశమవుతుండటం ఆస్తక్తిని రేపుతోందని రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాల నాయకులు చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి, సీఎ జగన్ బాబాయ్.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైన కదలికలు వచ్చినప్పుడే జగన్ దిల్లీకి వెళ్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.