ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెదిరిన ఆశలు.. అర్థిస్తున్న చేతులు - కడపలో రైతుల సమస్యలు

ప్రకృతి కన్నెర్ర చేయడంతో పచ్చని పంటలు నేలకూలాయి.. అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. కన్నీరే మిగిలింది. అరటి గెలలు విరిగాయి.. మామిడి నేలరాలింది.. బొప్పాయి చేజారిపోయింది...చీనీ, నిమ్మ చెట్లు నిలువునా ఎండిపోయాయి. పెట్టుబడి పోయి అప్పులు గుదిబండగా మారాయి. ఆ నష్టాలకు సర్కారీ సాయం ఎంతో కొంత అందుతుందని ఆశించిన రైతులకు ఎదురుచూపులే మిగిలాయి.

farmers problems
farmers problems

By

Published : Jun 18, 2020, 8:56 AM IST

కడప జిల్లాలో ఉద్యాన తోటలు 1.20 లక్షల హెక్టార్లలో సాగులో ఉన్నాయి. పండ్లు, కూరగాయాలు, పూల తోటలు, సుగంధ ద్రవ్యాల పంటలపై అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. ఏటా వేసవిలో పెనుగాలులు దూసుకొచ్చి పండ్ల తోటలపై విరుచుకుపడి విధ్వంసం చేస్తున్నాయి. అకాల వర్షంతో అపార నష్టం జరుగుతోంది. వడగండ్ల వానల కడగండ్లతో కోలుకోలేని గాయాలవుతున్నాయి. మరోవైపు దుర్భిక్షంతో ఫలాలిచ్చే చెట్లు ఎండిపోయాయి. ప్రభుత్వం నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందడం లేదు. జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల, బద్వేలు, కమలాపురం, కడప, జమ్మలమడుగు, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఎక్కువగా తోటలు దెబ్బతిన్నాయి.

2016 మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు నాలుగేళ్ల కాలంలో ఉద్యాన తోటలు 14,861.35 హెక్టార్లలో నేలవాలాయి. అధికారులు పంట నష్టంపై క్షేత్రస్థాయిలో సర్వే చేయగా బాధిత రైతులు 26,348 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి రూ.33.33 కోట్లు పెట్టుబడి రాయితీ మంజూరు చేయాలని జిల్లా నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ప్రకృతి విపత్తులు పంజా విసరడంతో 2016లో రూ.136.42 లక్షలు, 2017లో రూ.306.15 లక్షలు, 2018లో రూ.519.61 లక్షలు, అదే ఏడాది కరవుతో జరిగిన నష్టానికి రూ.9.49 కోట్లు రావాల్సి ఉంది. 2019లో రూ.4.21 కోట్లు, ఈ ఏడాది రూ.10 కోట్లు ఇవ్వాలని నివేదించినా ఇప్పటికీ పైసా విడుదల చేయలేదు. కర్షకుల కంట కన్నీరు ఊబికి వస్తోంది. సాయం చేయడంలో ఈ రోజు..రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా రైతుల బతుక్కి భరోసా లేకుండాపోతోంది.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

జిల్లాలో ప్రకృతి విపత్తులతో ఉద్యాన తోటలు దెబ్బతిన్నాయి. నాలుగేళ్లుగా పెట్టుబడి రాయితీ చెల్లించాల్సి ఉంది. బాధిత రైతులను ఆదుకునేందుకు వెంటనే పెట్టుబడి రాయితీ మంజూరు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఈదురు గాలులు, అకాల వర్షాలు, కరవుతో తోటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పన్లేదు. - ఎల్‌.వజ్రశ్రీ, ఉప సంచాలకులు, ఉద్యాన శాఖ, కడప

ఇదీ చదవండి:రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

ABOUT THE AUTHOR

...view details