అంకితభావంతో పని చేసి కడప జిల్లా రాయచోటి పురపాలికను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉద్యోగులకు సూచించారు. ఇవాళ పురపాలక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జకియా ఖానంతో కలసి 16 మంది నూతన వార్డు కార్యదర్శులకు నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాశయంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే సేవలు అందిస్తున్నారన్నారు.
వార్డు కార్యదర్శులు మున్సిపాలిటీ అభివృద్ధిపైనా, పారిశుద్ధ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాంబాబు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.