కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో పేదప్రజలకు పోలీసులు కూరగాయలు అందించారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్థానిక నాయకుల సహకారంతో దాదాపు 5వేల కుటుంబాలకు 40 టన్నుల కూరగాయలు అందజేశారు. కరోనా నేపథ్యంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రజలకు మాస్కులు అందించారు. ఎల్ఐసీ ఏజెంట్ల సహకారంతో 15 వందల మాస్కులు పంపిణీ చేశారు.
లాక్ డౌన్ కారణంగా ఆదాయం లేక, ఆహారం దొరక్క దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కార్మికులకు.. ముగ్గురు మిత్రులు ఆహారం అందించారు. విజయవాడ పాతబస్తీలో సుమారు 300ల మందికి భోజనం ఏర్పాటుచేశారు. లాక్ డౌన్ ఉన్నన్నాళ్లు ఇలా తమకు తోచిన సాయం చేస్తామని సురేశ్, రాజ్, పురోహిత్లు తెలిపారు.
విశాఖ మన్యం పాడేరులో శ్రీనివాస్ అనే దర్జీ మాస్కులు కుట్టి ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారు. దాతలు ఇచ్చిన వస్త్రాలతో ఇప్పటివరకు 5వేల మాస్కులు కుట్టి పంపిణీ చేశారు. 200 మాస్కులు కుట్టి వైద్యులు, నర్సులకు, సిబ్బందికి అందించారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కోల్లివలస పంచాయతీలో ఉన్నప్రజలకు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు. దాదాపు వెయ్యి కుటుంబాలకు సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని వెంకట చిరంజీవి పాల్గొన్నారు.
లాక్ డౌన్ కొనసాగినంత కాలం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వైకాపా జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం అన్నవరంలో దివీస్ యాజమాన్యం సహకారంతో ప్రజలకు ఇస్తున్న సరకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్పొరేట్ కంపెనీలు అన్నీ లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి.. ఆందోళన పడకండి.. అప్రమత్తంగా ఉండండి: మంత్రులు