బద్వేల్ ఉపఎన్నిక( Badvel by poll 2021)కు సంబంధించి ఇవాళ్టి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్( chief electoral officer vijayanand) వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. నామినేషన్ సందర్భంలో ఒక్కరే వెళ్లి దాఖలు చేయాలని స్పష్టం చేశారు. ర్యాలీలను నిషేధించామని.. ఈనెల 30న పోలింగ్, నవంబర్ 2న లెక్కింపు ఉంటుందన్నారు. ఈనెల 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన ఉంటుందని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 13 వరకు గడువు ఉందని వివరించారు. ఈవీఎంల(Electronic Voting Machines)కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
'కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు పాటించాలి. ఎన్నికల ప్రచారంలో ద్విచక్ర వాహన, ఇతర ర్యాలీను నిషేధించాం. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితో పాటు ఒక్కరే వెళ్లాలి. ఇండోర్‌లో 200 మంది, బహిరంగ ప్రదేశాల్లో 1000 మందికి మించి సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదు. దీనిపై ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి, పోలీసుశాఖకు ఆదేశాలు ఇచ్చాం. ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదు. వీధులు, కాలనీల్లో నిర్వహించే సమావేశాల్లో 50 మందికి మించి ఉండరాదు. ఈ విషయాలను ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలకు సూచించాం' -విజయానంద్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
ఎమ్మెల్యే మృతి.. ఉప ఎన్నిక అనివార్యం