ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Archery Player Srinivas: సీఎం హామీకి నాలుగేళ్లు.. సాయం కోసం ఆర్చరీ క్రీడాకారుడు ఎదురుచూపు

9th standard student Venkata Sai Srinivas excels in archery: కడప నగరానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి వెంకట సాయి శ్రీనివాస్ విలువిద్యలో అద్భుత ప్రతిభ చాటుతున్నాడు. తల్లిదండ్రుల సహాయంతో ఇప్పటివరకూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 57 వరకు పతకాలు సాధించాడు. కానీ, అమెరికాలో జరగబోయే పోటీల్లో పాల్గొనేందుకు స్తోమత లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని కోరుతున్నాడు.

sai
sai

By

Published : Jul 17, 2023, 5:14 PM IST

Updated : Jul 17, 2023, 5:21 PM IST

9th standard student Venkata Sai Srinivas excels in archery: అతనిదొక మధ్య తరగతి కుటుంబం. తండ్రి ఇంటర్నెట్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి గృహిణి. అయిదేళ్ల వయస్సులో ఆర్చరీ (విలువిద్య) ఆటవైపు అడుగులు వేశాడు. ఆర్చరీపై కుమారుడికున్న ఆసక్తిని గుర్తించిన తల్లి.. ఓ శిక్షణ కేంద్రంలో చేర్పించింది. దీంతో పట్టు వదలకుండా రోజులు, గంటల తరబడి సాధన చేస్తూ.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 57 వరకు పతకాలు సాధించాడు. అంతేకాదు, తన క్రీడా ప్రతిభతో అందరి మన్ననలు పొందడమే కాకుండా.. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సైతం మెప్పించాడు. కానీ, అమెరికాలో జరగబోతున్న విలువిద్య పోటీల్లో పాల్గొనేందుకు స్తోమత లేక నానా అవస్థలు పడుతున్నాడు. ఆర్థికసాయం కోసం తల్లిదండ్రులు నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా ప్రభుత్వం ఎటువంటి సాయం చేయకపోవడంతో.. దాతలు ముందుకొచ్చి తమ బిడ్డకు తోడుగా నిలవాలని వేడుకుంటున్నారు.

గుర్తుకు ఉన్నానా జగన్ సార్..!..ఆర్థికసాయం చేయండి సార్:ఆర్చరీ క్రీడాకారుడు

విలువిద్యలో 57 పతకాలు సాధించిన విద్యార్థి.. కడప నగరానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్ధి వెంకట సాయి శ్రీనివాస్ విలువిద్యలో అద్భుత ప్రతిభ చాటుతున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 57 వరకు పతకాలు సాధించాడు. వాటిలో 31 స్వర్ణాలు.. 13 వెండి, 13 కాంస్య పతకాలున్నాయి. తన క్రీడా ప్రతిభతో అందరి మన్ననలు పొందడమే కాకుండా సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సైతం మెప్పించాడు. ఇంతటి ప్రతిభ గల విద్యార్థికి ప్రభుత్వం నుంచి గానీ, శాప్ నుంచి గానీ ఎలాంటి ఆర్థికపరమైన ప్రోత్సాహం అందక పోవడంతో నాలుగేళ్లుగా క్రీడాకారుడి తల్లిదండ్రులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా సాయం అందకపోవడంతో కుమారుడి విలువిద్య పోటీల కోసం ఇంటిని, బంగారాన్ని తాకట్టు పెట్టి.. పోటీలకు సిద్ధం చేస్తోన్నారు. మరో ఆరు నెలల్లో అమెరికాలో జరిగే ప్రపంచ ఆర్చరీ పోటీలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆర్థిక స్తోమత లేక స్పాన్సర్లు, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

అయిదేళ్లలోనే ఆటపై దృష్టి.. కడపకు చెందిన వెంకట సాయి శ్రీనివాస్ మూడో తరగతి నుంచే విలువిద్యపై సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం కడప నగరంలోని శ్రీచైతన్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. విలువిద్యపై అబ్బాయికున్న మక్కువను గమనించిన తల్లి కీర్తి.. నిత్యం వెన్నుతట్టి ముందుకు నడిపిస్తోంది. నాన్న పీవీ గోపినాథ్ ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నారు. సాయి శ్రీనివాస్ అయిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు, తాతయ్య ప్రోత్సాహంతో క్రీడారంగం వైపు అడుగులేశాడు. 2014లో తొలిసారిగా మార్షల్ ఆర్ట్స్‌లో సాధన చేయడం మొదలుపెట్టాడు. ఫీల్డ్ ఆర్చరీ శిక్షకుడు వర్ధి ఉదయ్ కుమార్ రకరకాల ధనుస్సులతో బాణాలు సంధిస్తుంటే ఆసక్తిగా గమనించేవాడు.

క్రీడకారుడికి అండగా నిలిచిన పాఠశాల.. అలా విలువిద్యపై మక్కువతో 2015 నుంచి ఫీల్డ్ ఆర్చరీ వైపు అడుగేలేశాడు. అదే ఏడాది మేలో కడప నగరంలోని విజయాస్ ఆర్చరీ అకాడమీలో చేరి, విలువిద్య సాధన మొదలు పెట్టాడు. రోజూ ఉదయం అకాడమీలో సాధన చేయడం, అనంతరం పాఠశాలకు వెళ్లడం, తిరిగి సాయంత్రం అకాడమీలో సాధన చేయడం దినచర్యగా మార్చుకున్నాడు. సాయి శ్రీనివాస్ ప్రతిభను మెచ్చిన శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం నాలుగో తరగతిలో 50శాతం స్కాలర్​షిప్ ఇవ్వగా,.. 5వ తరగతి నుంచి ఉచిత విద్యతో పాటు ఉచితంగా పుస్తకాలు అందిస్తోంది. జాతీయ టోర్నమెంట్లకు స్పాన్సర్​గానూ వ్యవహరిస్తోంది. దీంతో ఇప్పటివరకు సాయి శ్రీనివాస్ 57 వరకు పతకాలు సాధించాడు. వీటిలో అంతర్జాతీయ పోటీల్లో రెండు బంగారు పతకాలు, జాతీయ స్థాయి పోటీల్లో 29 బంగారు, 13 రజతం, 13 కాంస్య పతకాలు సాధించాడు.

2019లో బంగారు పతకం కైవసం..2019 ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ వరకు న్యూజిలాండు వెల్లింగ్టన్‌లో జరిగిన ప్రపంచ ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న శ్రీనివాస్.. బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో 350 మంది పాల్గొన్న ఆర్చరీలతో భారత్ తరపున 13 ఏళ్ల వయసు, 10 మీటర్ల దూరం విభాగంలో పోటీపడిన శ్రీనివాస్ ఈ ఘనత సాధించాడు. కాంపౌండ్ ప్రీ స్టైల్ లిమిటెడ్ విభాగంలో మూడు రోజుల పాటు జరిగిన ఆర్చరీ పోటీల్లో పాల్గొని 900 పాయింట్లకు 853 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. వీటితోపాటు 2019 సెప్టెంబరు 6 నుంచి 8 వరకు ముంబాయిలో జరిగిన జాతీయ ఇండోర్ ఫీల్డ్ అర్చరీ ముంబాయి మేయర్ కప్ పోటీల్లో పాల్గొన్న సాయి శ్రీనివాస్.. నాలుగు బంగారు పతకాలు సాధించాడు.

ఏషియా కప్ టోర్నీలో బంగారు పతకాలు సాధిస్తా.. ముంబాయిలో మూడు రోజులు జరిగిన క్రీడలో.. తొలిరోజు 300 పాయింట్ల గానూ 295 పాయింట్లు, రెండోరోజు 300 పాయింట్ల గానూ 294 పాయింట్లు, మూడోరోజు 300 పాయింట్లకు గానూ 298 పాయింట్లు సాధించాడు. మూడు రోజులు అందరికంటే టాప్‌లో నిలవడంతో మూడు బంగారు పతకాలతో ఓవరాల్‌గా టాప్‌లో నిలిచినందుకు మరో బంగారు పతకం దక్కించుకున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ముంబాయిలో వరసగా మూడేళ్ల పాటు జరిగిన జాతీయ ఇండోర్ ఫీల్డ్ ఆర్చరీ మేయర్ కప్ పోటీల్లో సాయి శ్రీనివాసే వరసగా బంగారు పతకాలు కైవసం చేసుకోవడం గమనార్హం. 2018 ఏప్రిల్‌లో చెన్నైలో జరిగిన ఆర్చరీ పోటీల్లో పాల్గొని, 15 నిమిషాల 15 సెకన్లలో 170 బాణాలు సంధించి ఏషియా బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ బుడతడికి రోటరీ క్లబ్ వారు యంగ్ అచీవర్ అవార్డు అందజేశారు. స్పాన్సర్లు, ప్రభుత్వం ప్రోత్సహిస్తే కామన్వెల్త్, ఏషియా కప్ టోర్నీలో పాల్గొని బంగారు పతకాలు సాధించాలనేది తన కల అని శ్రీనివాస్ చెప్తున్నాడు.

పులివెందుల పర్యటనలో జగన్ హామీ..విలువిద్యలో ఇంతటి ప్రావీణ్యం సంపాదిస్తున్న సాయి శ్రీనివాస్‌కు ఆర్థిక ఇబ్బందులు వెంట నడిచాయి. 2019లో న్యూజిలాండ్‌లో అంతర్జాతీయ ఆర్చరీ పోటీలకు సాయి శ్రీనివాస్‌కు పిలుపొచ్చింది. 2019 సెప్టెంబరులో ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటనకు వచ్చినప్పుడు క్రీడాకారుడు సాయి శ్రీనివాస్, తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలవడంతో క్రీడాకారుడిని అభినందిస్తూ, అంతర్జాతీయ టోర్నీలు ఆడి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ సందర్భంలోనే క్రీడాకారుడికి స్పెషల్ కేటగిరీ కింద స్కాలర్​షిప్ నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ, నాలుగేళ్లుగా అబ్బాయి తల్లిదండ్రులు శాప్, జిల్లా, రాష్ట్ర అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

గొప్పగా హామీలు..సీఎం జగన్‌పై విమర్శలు..సాయాలు క్రీడాకారుడు ప్రతిభను గుర్తించిన శాప్‌లో కొనుగోలు, క్రీడా దుస్తులు, ఫీల్డ్ ఆర్చరి నుంచి రెగ్యులర్ ఆర్చరీ ఆటకు మారేందుకు శిక్షణ అవసరాలకు రూ.5 లక్షలు ఇస్తామని నాటి శాప్ ఎండీ శేషగిరిబాబు హామీ ఇచ్చినా నెరవేరలేదు. అనంతరం శాప్ ఎండీగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాతైనా న్యాయం చేస్తారేమోనన్న ఆశతో క్రీడాకారుడి తల్లి 9 నెలల కిందట శాప్ ఎండీ కలిసి తన బిడ్డ ప్రతిభ, తన ఆర్థిక పరిస్థితులను వివరించారు. తప్పకుండా న్యాయం చేస్తామని శాప్ ఎండీ హామీ ఇచ్చి గతంలో ఇస్తామన్న నిధుల ఉత్వర్వులను రాష్ట్ర సచివాలయానికి పంపించారు. నాటి నుంచి నేటి వరకు కడప నుంచి విజయవాడ సెక్రటేరియట్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేదని క్రీడాకారుడి తల్లి కీర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ కల్గిన విలువిద్య క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తామని గొప్పలు చెబుతున్నా.. సీఎం సొంత జిల్లాలో ఆయన వెన్నుతట్టిన క్రీడాకారుడి భవిత ప్రశ్నార్థకం కాకుండా చూడాలని తల్లిదండ్రులు, తోటి విలువిద్య క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Last Updated : Jul 17, 2023, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details