ఈ ఏడాది మార్చి 15న కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హత్య జరిగి 8 నెలలు దాటినా... ఇంతవరకు నిందితులు ఎవరనేది పోలీసులు కనిపెట్టలేకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పోలీసులు ఏమంటున్నారు...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి హత్యకు గురైనా... ఈ కేసులో పురోగతి లేకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. వివేకా నివాసంలోనే హత్య జరగటం... ఆ వెంటనే రక్తపు మరకలు తుడిచి వేయటంతో హత్యకు సంబంధించిన ఆధారాలు లభ్యం కావటం లేదని పోలీసులు భావిస్తున్నారు.
నార్కో పరీక్షల వల్ల ఫలితం శూన్యం..
కేసును ఛేదిందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా ఇంతవరకు పురోగతి సాధించలేకపోయారు. అనుమానితులైన పరమేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డికి గుజరాత్ రాష్ట్రంలో నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించారు. అయినా కేసు ఛేదనలో ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే 1300 మందిని విచారించిన సిట్ అధికారులు ఎలాంటి ఆధారాలు గుర్తించలేకపోయారు.
శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యతో విచారణకు బ్రేక్
చివరిగా ఆగస్టు 1న సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో కేసు మందగించింది. తనను పోలీసులు వేధిస్తున్నారని లేఖ రాసి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. డీజీపీ గౌతం సవాంగ్ సైతం కడపకు వచ్చి వివేకా కేసుపై సమీక్ష చేసి వెళ్లినా నిందితులెవ్వరనేది నిర్ధరణకు రాలేదు.