నేడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ...ఏలూరులో సీఎం శ్రీకారం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా లబ్ధిదారులకు కార్డుల పంపిణీని ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్డులను జారీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శ్రీకారం చుట్టునున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 2059 వ్యాధులకు చికిత్స అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పశ్చిమ గోదావరి జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో 1259 రోగాలకు చికిత్స అందించేలా కార్యాచరణ చేపట్టింది. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్ వ్యాధికి కూడా ఆరోగ్యశ్రీ కింద పూర్తి చికిత్స అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల కార్డుల ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయనుంది.
అదనంగా 1000 వ్యాధులకు చికిత్స
దారిద్ర్యరేఖ దిగువనున్న కుటుంబాలకు వైద్య ఖర్చులు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపచేసేలా ప్రభుత్వం ఈ పథకానికి రూపొందించింది. గతంలో కంటే అదనంగా వెయ్యి వ్యాధులను ఈ జాబితాలో చేర్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అదనంగా చేర్చిన వెయ్యి వైద్య చికిత్సల్లో భాగంగా 780 వరకూ ఇన్ పేషెంట్ వైద్య చికిత్సలతో పాటు 170 ఒక్క రోజులో పూర్తి అయ్యే స్వల్పకాలిక చికిత్సలు, మరో 50 ఇతర స్వల్ప కాలిక చికిత్సలు ఉన్నాయి.