పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం భోగోలు గ్రామానికి చెందిన తాడేపల్లి మౌనిక మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగానికి ఎంపికైంది. ఈ కొలువు సాధించడానికి వెనుక ఆమె నిరంతర కృషి దాగుంది. నిరుపేద కుటుంబానికి చెందిన మౌనిక చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. మౌనికను ప్రభుత్వ ఉద్యోగంలో చూడాలని ఆమె తల్లి కోరిక. కానీ తన కూతురు చదువు పూర్తి కాక ముందే ఆమె కన్నుమూసింది. తల్లి కలను నెరవేర్చడానికి ఎన్ని కష్టాలు వచ్చినా మౌనిక తన ప్రయత్నాన్ని ఆపలేదు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మొదటి ప్రయత్నంలో ఎస్సై కొలువు సాధించింది.
ఎస్సై కొలువు సాధించింది..కన్నతల్లి కల నెరవేర్చింది - government education
మూరుమూల గ్రామంలో పేద కుటుంబానికి చెందిన యువతి ఎస్సై ఉద్యోగాన్ని సాధించింది. ఆడ పిల్లలకు చదువెందుకన్న గ్రామస్తులతోనే శభాష్ అనిపించుకుంది. ప్రైవేటు విద్యాసంస్థల మెట్లు ఎక్కకుండానే.. పోటీ ప్రపంచంలో ముందువరుసలో నిలిచి.. విజయాన్ని అందుకుంది.
మౌనిక ప్రైవేటు విద్యాసంస్థ మెట్లు ఎక్కకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.ఒకటి నుంచి పదోతరగతి వరకు తన స్వగ్రామమైన భోగోలు ఉన్నత పాఠశాలలో చదివింది. పదిలో 500లకు పైగా మార్కులు సాధించి.. పాఠశాలలోనే మొదటిస్థానంలో నిలిచింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి కోర్సు పూర్తి చేసింది. అనంతరం ఎన్టీఆర్ విద్యోన్నతి సివిల్ కోచింగ్‌కు అర్హత పరీక్ష రాసి ఎంపికైంది. గుంటూరులో ఎన్టీఆర్ విద్యోన్నతలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం కోచింగ్ తీసుకుంటూనే ఎస్సై పరీక్ష రాసి విజయాన్ని పొందింది.
ట్రిపుల్ ఐటీ పూర్తయిన వెంటనే పెళ్లి చేయండని తల్లితండ్రులకు బంధువులు సలహా ఇచ్చారు. వీటిని లెక్కచేయకుండా మౌనికకు కుటుంబసభ్యులు దన్నుగా నిలిచారు. వారి ఆశలను నెరవేర్చి ఆడపిల్లలు చదువుకోవాలన్న ఆశను గ్రామంలో కలిగించింది ఈ యువతి. పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా పోటీ ప్రపంచంలో విజయం సాధించవచ్చని చెప్పడానికి ఉదాహరణగా మారింది మౌనిక.