ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చేయూతనివ్వండి... గెలిచి చూపిస్తా'

తండ్రి కలల్ని నిజం చేసేందుకు అథ్లెట్​గా మారింది ఆ అమ్మాయి. ఆరేళ్ల కిందట పరుగు ప్రారంభించి జాతీయ స్థాయిలో పతకాలు గెలిచింది. రాష్ట్రస్థాయిలో 100 పైగా బంగారు పతకాలు సాధించి అబ్బుర పరిచింది. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే అంతర్జాతీయ వేదికలపై దేశం తరపున బంగారు పతకం సాధిస్తానని ధీమాగా చెబుతున్న యువ అథ్లెట్ జ్యోతికశ్రీపై ప్రత్యేక కథనం.

special package on young athelete jyothika sri
యువ అథ్లెట్ జ్యోతికశ్రీ

By

Published : Apr 26, 2020, 6:54 PM IST

సాధారణంగా అందరూ తమ ఆశయాల్ని నెరవేర్చుకునేందుకు కష్టపడతారు. అయితే జ్యోతికశ్రీ తన తండ్రి కలను తన లక్ష్యంగా మార్చుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తునికి చెందిన జ్యోతికశ్రీ ప్రస్తుతం విజయవాడలోని సిద్ధార్ధ మహిళా కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి బాడీబిల్డర్​గా రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆ క్రీడను మధ్యలోనే వదిలేశారు. దేశానికి పతకం అందించాలన్న తన కోరికను కుమార్తెతో నెరవేర్చాలనుకున్నారు. దేశం గర్వపడే క్రీడాకారిణిగా తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు.

తండ్రి ఆశయాన్ని సాధించేందుకు ఆరేళ్ల కిందట పాఠశాల స్థాయిలో పరుగు మొదలు పెట్టింది జ్యోతికశ్రీ. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. 200, 400 మీటర్ల పరుగు పందెంలో రాణిస్తోంది. మొదటి రెండేళ్లు చాలా కష్టపడ్డాడని.. ఆ తర్వాత తొలిసారి పతకం సాధించాక ఆత్మస్థైర్యం పెరిగిందని జ్యోతిక చెబుతోంది. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో 100 బంగారు పతకాలు, జాతీయస్థాయిలో 10 బంగారు, 4 వెండి పతకాలు సాధించి తండ్రి ఆశయం సాధించే దిశగా వడివడిగా అడుగులేస్తోంది. తాజాగా ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొన్న జ్యోతికశ్రీ... 400 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం సాధించింది.

ఆమె పరుగు శిక్షణ సాగుతోందిలా...

కోచ్ వినాయక్ ప్రసాద్ వద్ద శిక్షణ తీసుకుంటుంది. ఉదయాన్నే 5 గంటలకు లేచి 8:30 గంటల వరకు స్థానిక లయోల కాలేజీ క్రీడా ప్రాంగణంలో సాధన చేస్తుంది. మళ్లీ సాయంత్రం 4:30 నుంచి 7:30 గంటల వరకు సాధన చేస్తుంది. తన శిక్షణకు, బలవర్ధక ఆహారానికి నెలకు 30 వేల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపింది. ఆమె కోచ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మైదానం అందుబాటులో లేదని చెప్పారు. ప్రభుత్వం సాయమందిస్తే జ్యోతికశ్రీ కచ్చితంగా అంతర్జాతీయ వేదికల్లో పతకం సాధిస్తుందని ఆయన తెలిపారు. పోటీలకు వెళ్లినప్పుడు ఆమెతోపాటు తల్లి తోడుగా వెళ్తుంది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంతవరకు రాగలిగానని చెప్పింది జ్యోతిక.

తను నెరవేర్చలేకపోయిన ఆశయాన్ని తన కుమార్తె ద్వారా సాధించుకుంటున్నారు జ్యోతిక తండ్రి. మధ్యతరగతి కుటుంబమే అయినా.. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. కుమార్తెను దేశం గర్వించే క్రీడాకారిణిగా తయారు చేయాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. ప్రపంచస్థాయి పోటీల్లో దేశం తరఫున పతకం సాధించటమే తన లక్ష్యమంటున్న జ్యోతికశ్రీకి ఆల్ ది బెస్ట్.

ఇవీ చదవండి.. ఆ రంగంలో ఇప్పుడు నష్టాలున్నా తర్వాత లాభాలే..!

ABOUT THE AUTHOR

...view details