పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని నీలాద్రిపురం, అప్పారావుపేట, వీరంపాలెం, బంగారు గూడెం, వెంకట్రావుపురం, కొమ్ముగూడెంలో ఎలాంటి అనుమతుల్లేకుండా మట్టితవ్వకాలు జరిగిపోతున్నాయి. పంట పొలాలను అక్రమ సంపాదన కోసం తవ్వేస్తున్నారు. రేయింబవళ్లు సుమారు వంద ఎకరాల్లో మట్టి తరలిపోతోంది. ప్రతి రోజు 2వందల నుంచి 300 లారీల వరకు మట్టి ఎత్తుకుపోతున్నారు. లారీ మట్టికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తే ట్రాక్టర్ మట్టికి 600 వరకు వసూలు చేస్తున్నారు.
అధికారులకు ముడుపులు... పంట పొలాల్లో అక్రమంగా తవ్వకాలు - land
మొన్నటి వరకు చెరువుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టి కోట్లు దండుకున్న మట్టి మాఫియా కన్ను ఇప్పుడు పచ్చని పంట పొలాలపై పడింది. డబ్బులను ఎరగా చూపి తవ్వకాలు చేపడుతున్నారు. బంగారం పండే పొలాలను నాశనం చేస్తున్నారు. అన్యాయాలు అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకుండిపోతున్నారు.
కన్నెత్తి చూడని అధికారులు
అంతా బహిరంగంగా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా గ్రామాల సర్పంచులు ప్రధాన పాత్ర పోషిస్తున్నందున చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ మట్టిని తాడేపల్లిగూడెంలోని నాన్లేఅవుట్లు పూడ్చేందుకు వినియోగిస్తున్నారు. గ్రామస్థాయి అధికారులు నుంచి ఉన్నత స్థాయి వరకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టచెబుతున్నారనే ఆరోపణలు మట్టి మాఫియాపై ఉన్నాయి. అందుకే ఇటుగా చూసేందుకు అధికారులు ఇష్టపడం లేదన్నది స్థానికుల వాదన. అందుకే యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి.