ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నది సంద్రంలో నిర్వాసితుల విలవిల

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు తల్లడిల్లిపోతున్నారు. గోదావరి నీరు ఊళ్లను ముంచేస్తుండటంతో బతుకు జీవుడా అంటూ ఇళ్లను ఖాళీ చేసి తలోదిక్కుకు చేరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూములను, ఊళ్లను, జీవితాలను త్యాగం చేసినా తమ కష్టాలను పట్టించుకునే నాథుడే లేకపోయారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఇస్తామని చెప్పిన పునరావాస ప్యాకేజీ నిధులూ అందలేదు. కాలనీల నిర్మాణమూ పూర్తి చేయలేదు.

polavaram homeless people
polavaram homeless people

By

Published : Jul 14, 2021, 4:49 AM IST

గోదావరిలో ఇంకా వరద రాలేదు. ప్రవాహాలు లక్షల క్యూసెక్కులకు చేరలేదు. కానీ పోలవరం వద్ద జలాశయంలో పెద్ద ఎత్తున నీరు నిలిచి వెనక్కుమళ్లుతోంది. పోలవరం క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నా వెనక్కు నీరు ఎగదన్నుతోంది. పోలవరం నుంచి ఎగువకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో వేలేరుపాడు సమీపంలో గోదావరి వద్ద పెద్ద ఎత్తున నీరు నిలిచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం నుంచి గోదావరిలో పెద్దగా ప్రవాహాలు దిగువకు రాని పరిస్థితుల్లోనూ ఇంత నీరు నిలవడం ఇదే తొలిసారి అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

వరద లేనప్పుడే కాఫర్‌ డ్యాం ప్రభావం ఈ స్థాయిలో ఉంటే వరద రోజుల్లో ఇంకే స్థాయిలో ఉంటాయో అన్న ఆందోళన స్థానికుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు ఒక్కొక్కటిగా జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం, దేవీపట్నం మండలాల్లో 45 గ్రామాలను నీరు చుట్టుముట్టింది. దీంతో దేవీపట్నం మండలంలోని దాదాపు 15 కు పైగా గ్రామాల ప్రజలు తమ పునరావాసాన్ని తామే ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది.

ప్పటికే దేవీపట్నం మండలాన్ని గోదావరి వరద నీరు చుట్టుముట్టింది. మంటూరు, మడిపల్లి, మూలపాడు, అగ్రహారం, పెనికిలపాడు, ఏనుగులగూడెం, దేవీపట్నం, తొయ్యేరు, ఎ.వీరవరం, చిన రమణయ్యపేట పూడిపల్లి, పోశమ్మగండి తదితర గ్రామాల ప్రజలు ఊళ్లను ఖాళీ చేశారు. గోకవరం, కృష్ణునిపాలెం, రమణయ్యపేట గ్రామాల్లో అద్దె ఇళ్లు తీసుకుని ఉంటున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలకు అద్దె ఇళ్లు కూడా దొరకడం లేదు. వరద ఉన్న మూడు, నాలుగు నెలలే ఉంటారు. ఆ తర్వాత వెళ్లిపోతారని ఎవరూ అద్దెకు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు తల్లడిల్లిపోతున్నారు. గోదావరి నీరు ఊళ్లను ముంచేస్తుండటంతో బతుకు జీవుడా అంటూ ఇళ్లను ఖాళీ చేసి తలోదిక్కుకు చేరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూములను, ఊళ్లను, జీవితాలను త్యాగం చేసినా తమ కష్టాలను పట్టించుకునే నాథుడే లేకపోయారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఇస్తామని చెప్పిన పునరావాస ప్యాకేజీ నిధులూ అందలేదు. కాలనీల నిర్మాణమూ పూర్తి చేయలేదు.

ఆగస్టు నాటికి నిర్వాసితులందరినీ కాలనీలకు తరలిస్తామంటూ అధికారులు సిద్ధం చేసిన ప్రణాళికలు వాస్తవ రూపం దాల్చేలా కనిపించడం లేదు. మరోవైపు పోలవరం ఎగువన నిర్మించిన కాఫర్‌డ్యాం వల్ల ఇప్పటికే నీరు నిలిచిపోయింది. పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతుండటంతో బాధితులు ఎవరికి వాళ్లే చేతికి అందినవి సర్దుకుని వెళ్లిపోతున్నారు. మరికొందరు బంధువులను ఆశ్రయిస్తున్నారు. గిరిజనులు ఎత్తయిన కొండల్లో గుడిసెలు వేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుతో ముంపు ఏర్పడే ఉభయగోదావరి జిల్లాల్లోని ఏడు మండలాల్లోని వివిధ గ్రామాలను ‘ఈనాడు-ఈటీవీ’ బృందం సందర్శించింది. పునరావాస కాలనీల నిర్మాణ తీరుతెన్నులను చూసింది. నిర్వాసితులతో మాట్లాడింది. వారి గుండెల్లోంచి గోదారి పొంగుకొచ్చింది. కిందటి ఏడాది ముంపులో చిక్కుకుని పడ్డ కష్టాలు గుర్తొచ్చి వారి ఆవేదన ఆక్రందనైంది. కాఫర్‌డ్యాంతో ఈ ఏడాది మరింత వరద చుట్టుముడుతుందని చెబుతున్నారని, ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు భరించాలో అంటూ కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. తమకు దిక్కు చూపే వారే లేరా అంటూ చేతులెత్తి వేడుకుంటున్నారు....

ప్రాజెక్టు వల్ల ముంపులో చిక్కుకునే 7 మండలాలకు తొలి దశలో +41.15 మీటర్ల స్థాయిలో ప్రాజెక్టులో నీరు నిలబెడితే ఏర్పడే ముంపును లెక్కలోకి తీసుకుని పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టారు. ఆ పరిధిలోకి 5 మండలాల్లోని 115 నివాస ప్రాంతాలు వస్తాయని లెక్కించారు. మొత్తం 20,870 కుటుంబాలను తొలిదశలో తరలించాల్సి ఉంది. అధికారుల లెక్కల ప్రకారమే ఇంకా 17వేల కుటుంబాలకు పైగా ప్రజలను పునరావాస కాలనీలకు తరలించాలి. వివిధ మండలాల్లో 73 చోట్ల పునరావాస కాలనీల నిర్మిస్తున్నా అనేక చోట్ల ఇంకా కాలనీల నిర్మాణం పూర్తి కాలేదు. ఆ పునరావాస ఏర్పాట్లు పూర్తి చేయకముందే పోలవరంలో నీరు నిలవడంతో నిర్వాసితులు కష్టాలకు చిరునామాగా మారారు. పైగా తొలిదశ, మలిదశ ముంపు లెక్కలన్నీ తప్పుతున్నాయి. ప్రాజెక్టులో నీరు నిలబెట్టకముందే కాఫర్‌ డ్యాం పాక్షిక నిర్మాణంతోనే కిందటి ఏడాది +45.72 మీటర్ల స్థాయి నీరు నిలిచే ప్రాంతాల్లోకి ముందే నీరు చేరిపోయింది. దీంతో ఈ ఏడాది నిర్వాసిత గ్రామాల్లో భయం మరింత పెరిగింది. కిందటి ఏడాది వరద ముంపు భయాలతోనే ఈ ఏడాది నిర్వాసితులు ఊళ్లు ఖాళీ చేసి సొంత దారి చూసుకుంటున్నారు.

ఇక్కడ మైలురాయిలా కనిపిస్తున్నదే ఎఫ్‌ఆర్‌ఎల్‌ను సూచించే రాయి. అంటే పోలవరం జలాశయంలో పూర్తి స్థాయి నిల్వ ఉంటే +45.72 మీటర్ల స్థాయి వద్ద ఎంతవరకు నీరు నిలుస్తుందో అది సూచించేరాయి. వేలేరుపాడు మండలం కొయిద గ్రామ గిరిజనులు ముందుచూపుతో ఈ రాయికి ఎగువనే గుడిసెలు నిర్మించుకుంటున్నారు. ఎంత వరద వచ్చినా ఆ రాయి దాటి రాదని వారు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్నది కెచ్చెల చిన్నారెడ్డి, అతని కొడుకు...తండ్రి కెచ్చెల లచ్చిరెడ్డి, తల్లి, మరో అన్నయ్య కెచ్చెల శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఇక్కడ గుడిసె నిర్మించుకున్నారు.

స్వయంగా కాలనీల నిర్మాణం

నిర్వాసిత గ్రామాల గిరిజనులంతా సొంతంగా ఎత్తయిన ప్రాంతాల్లో గుడిసెలతో తాత్కాలిక కాలనీలను నిర్మించుకుంటున్నారు. వేలేరుపాడులో ఒక వ్యక్తి తన స్థలాన్ని ఇస్తే గిరిజనులు స్వయంగా తాటాకులు తెచ్చుకుని వీటిని కట్టుకున్నారు. స్థల యజమానికి నెలకు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. వేలేరుపాడు, కుక్కునూరు, వర రామచంద్రపురం, కూనవరం మండలాల్లో అనేక నిర్వాసిత గ్రామాల్లో ఇలా గిరిజనులు తమ ఆవాసం తామే ఏర్పాటు చేసుకుంటున్నారు. ‘‘మా కాలనీలోకి నీరు రాదంటున్నారు. 45.72 మీటర్ల వరద స్థాయిలో ఉందంటున్నారు. కానీ మొదట మాకే నీరొస్తోంది’’ అని తాట్కూరు గొమ్ము కాలనీ వాసి నంబూరి రాంబాబు తెలిపారు.

‘మాది నడుంగొమ్ము కాలనీ. 1986 వరదలో కూడా మెరకలోనే ఉంది. నిరుడు నీరు వచ్చింది. ఇప్పటికీ మా ఊరు అవార్డులో లేదంటున్నారు. నీరు మాత్రం వస్తోంది. అందుకే ఇక్కడ ఇలా నిర్మించుకుంటున్నాం’’ అని బుర్రి ఎర్రయ్య, తాడే రమణయ్యలు చెప్పారు.

అడ్వాన్సు రూ.2 లక్షలు కావాలంటున్నారు

‘‘మేం నిర్వాసితులమని మాకు ఎవరూ ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. మూడు, నాలుగు నెలలు ఉండి, మళ్లీ ఖాళీ చేసేస్తామని భయపడుతున్నారు. కనీసం ఏడాదిపాటు ఉంటామని భరోసా ఇస్తేనే అద్దెకు ఇస్తామని చెబుతున్నారు. ఇందుకోసం వారు రూ.2 లక్షల అడ్వాన్సు అడుగుతున్నారు. ఏడాది తర్వాత ఆ అడ్వాన్సు మొత్తం తిరిగి ఇస్తామంటున్నారు. మరికొందరు నెలకు రూ.4,000 నుంచి రూ.5,000 వరకు అద్దెకు ఇళ్లు వెతుక్కుంటున్నారు’’ అని బాధితులు వాపోతున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజలు అశ్వారావుపేట, వినాయకపురం, నందిపాడు, భద్రాచలం ప్రాంతాలకు అద్దెలకు వెళ్లిపోతున్నారు. బాధితులను ఈ తాత్కాలిక వలస మరిన్ని కష్టాల్లోకి నెట్టివేస్తోంది.

వరద తీరు మారి... రోజుల తరబడి ముంపులోనే

‘‘గోదావరి జిల్లాల్లో వరద రావడం, అది ఊళ్లల్లోకి రావడం సహజమే అన్న ధోరణిలో కొందరు అధికారులు ఉన్నారు. నిజమే. ఆ వరదకు ఇప్పటి వరదరకు చాలా తేడా ఉంది. ఇంతకుముందు వరద వచ్చినా నాలుగయిదు రోజులు మాత్రమే ఉండేది. రోజులకు రోజులు ముంపులో చిక్కుకున్న దాఖలాలు లేవు. గతంలో మొదట భద్రాచలంలో వరద పెరిగేది... మేం అప్రమత్తం అయ్యేవాళ్లం. ఇప్పుడు కాఫర్‌డ్యాంతో పాత అంచనాలన్నీ చెల్లాచెదురయ్యాయి. ప్రస్తుతం వరద రాకముందే పోలవరం వైపు నుంచి నీరు వెనక్కు ఎగదన్నుతోంది. గతంలో ముంపు నెమ్మదిగా వచ్చేది... వరద త్వరగా తగ్గేది. ఇప్పుడలా కాదు. వరద వేగంగా చుట్టుముడుతోంది... ముంపు రోజుల తరబడి ఉండిపోతోంది’’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నాళ్లనీ తాత్కాలిక పునరావాసం?

నిరుటి వరదకు మా కాలనీ ఇళ్లు మునిగిపోయి. తాత్కాలికంగా పునరావాస కాలనీ అంటూ తరలించారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. సరైన మరుగుదొడ్ల వసతులూ లేవు. ఏకంగా 16 రోజులకు పైగా ముంపు ఉండిపోయింది. మా ఇళ్లకు రాలేం. అక్కడ ఉండలేం. తొందరగా సర్వే చేసి పునరావాసం ప్యాకేజీ తేల్చి, కాలనీలు నిర్మించి పంపితే వెళ్లిపోతాం కదా. ఎన్నాళ్లు ఇలా ఇబ్బందులు పడమంటారు?

- బొజ్జా సుధారాణి, కుందుముళ్ల సంధ్య, గెద్దల కాంతమ్మ, కూనవరం మండలం ఉదయ భాస్కర్‌ కాలనీ

ఇదీ చదవండి:CM Jagan: 'పల్లెలు శుభ్రంగా ఉంటేనే..ప్రజలకు ఆరోగ్యం'

ABOUT THE AUTHOR

...view details