ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2022, 3:14 PM IST

ETV Bharat / state

PROTEST: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని.. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు..!

PROTEST: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. పన్నులు ఇబ్బడిముబ్బడిగా పెంచి.. సామాన్యుల నడ్డివిరుస్తున్నారంటూ కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టారు. కొన్ని చోట్ల నేతల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. మరికొంత మందిని ముందుగానే గృహనిర్బంధాలు చేశారు.

PROTEST
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని.. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు

PROTEST: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ వామపక్ష నేతలు చేపట్టిన చలో కలెక్టరేట్‌ను పోలీసులు ఎక్కడికక్కడే అణచివేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీపీఐ జిల్లా కార్యదర్శి భీమారావు, పట్టణ కార్యదర్శి నాగరాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుంటే.. నిర్బంధించటం ఏంటని నేతలు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యల పరిష్కారం కోసం తాము చేస్తున్న ఉద్యమాలను.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులతో అణచివేస్తున్నాయని ధ్వజమెత్తారు. పోలీసుల కళ్లుకప్పి కొంతమంది సీపీఐ నేతలు జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు.

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని.. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు

అనంతపురం జిల్లా: నార్పలలో సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. చలో కలెక్టరేట్‌కు వెళ్తున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

ఎన్టీఆర్​ జిల్లా: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఎన్టీఆర్​ జిల్లా నందిగామలో సీపీఎం, సీపీఐ నేతలు ధర్నా చేపట్టారు. పన్నులు పెంచి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్, బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు తప్పులను నెట్టుకుంటూ.. ప్రజలపై భారం మోపుతున్నారని ఒంగోలులో వామపక్ష నేతలు ధర్నా నిర్వహించారు. ధరలు తగ్గించాలంటూ కడప కలెక్టరేట్ వద్ద సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. ధరలు తగ్గించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

మన్యం జిల్లా: ధరల పెరుగుదలను నిరసిస్తూ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమే కాకుండా.. ధరలు పెంచి ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో పావలా ఇచ్చి.. పన్నుల పేరిట పది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details