ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందుబాటులో ఉండని కిసాన్‌ రైళ్లు...రైతులు, వ్యాపారులు ఇబ్బందులు - Kisan trains

దేశవ్యాప్తంగా పండే పంట ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు రవాణా చేయడానికి కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్‌ రైళ్లు కొన్ని కారణాలతో అందుబాటులో ఉండటం లేదు. రైళ్లు ఆలస్యంగా నడపడం, రద్దు చేయడం వంటి కారణాలతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసే రైతులు, వ్యాపారులు నష్టాలపాలవుతున్నారు. అయితే బొగ్గుగు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో మరో 10 రోజుల వరకు కిసాన్‌ రైళ్లకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు చెబుతున్నారు.

కిసాన్‌ రైళ్లు
కిసాన్‌ రైళ్లు

By

Published : Nov 8, 2021, 4:55 AM IST

కిసాన్‌ రైళ్లు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి వివిధ వ్యవసాయ ఉత్పత్తులు ఉత్తర భారతదేశానికి ఎగుమతి చేసేలా కేంద్రం కిసాన్‌ రైలును రెండు నెలల కింద ప్రారంభించింది. ఇక్కడి నుంచి కోడిగుడ్లు, ఉల్లి, ఇతర పండ్లు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ రైలు ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. సరైన సమయానికి కిసాన్ రైలు నడపకపోవడంతో కొన్న ఉల్లిని నిల్వ చేసుకోలేక... స్థానిక మార్కెట్లో విక్రయించలేక.. వ్యాపారులు నష్టపోతున్నారు. ఫలితంగా రైతుల వద్ద నుంచి ఉల్లి కొనుగోలు చేయడం లేదు. ఈ ప్రభావం ధరలపై పడుతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్‌... రాష్ట్రంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరుగాంచింది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ నుంచి రోజూ సుమారు 250 టన్నుల ఉల్లి మార్కెట్‌కు వస్తోంది. ఇక్కడి నుంచి అస్సాం, బీహార్, దిల్లీ, పశ్చిమబంగా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా ప్రాంతాలకు ఉల్లి ఎగుమతి అవుతోంది. గతంలో లారీల ద్వారా సరుకును ఆయా రాష్ట్రాలకు వ్యాపారులు తరలించేవారు. దీని వల్ల రవాణా వ్యయం పెరిగి నష్టపోయేవారు. దీంతో గిరాకీ తగ్గి.. మార్కెట్లో ధరలు పడిపోయేవి. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం కిసాన్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు నెలల కాలంలోనే 37 రైళ్ల ద్వారా ఉల్లిని ఇతర ప్రాంతాలకు రవాణా చేశారు. దీంతో సుమారు 4 కోట్ల రూపాయల ఆదాయం తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌కు సమకూరింది. కానీ ప్రస్తుతం కొన్ని కారణాలతో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ఎగుమతుల్లేక ఉల్లి.. కుళ్లిపోతోందని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు.

రైతు పంట ఉత్పత్తులను దేశంలో వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసే కిసాన్ రైలును సమయానికి ఆయా రైల్వేస్టేషన్లలో అందుబాటులో ఉంచాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పోటెత్తుతున్న అమరావతి ఉద్యమం.. పోలీసు హెచ్చరికలతో అలజడి!

ABOUT THE AUTHOR

...view details