ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగిన గోకులాల బిల్లులు.... అన్నదాతలు అప్పులపాలు

గత ప్రభుత్వ హామీతో వేలాది రూపాయలు ఖర్చు చేసి మినీ గోకులాలు నిర్మించుకున్న రైతులు... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 90 శాతం రాయితీ వస్తుందన్న నమ్మకంతో వడ్డీకి అప్పులు తెచ్చి రైతులు షెడ్లు నిర్మించారు. బిల్లు చేతికొచ్చే సమయానికి ఎన్నికల కోడ్ రావటం.. అనంతరం ప్రభుత్వం మారిపోవడం.. ఈ పరిస్థితికి కారణమైంది.

By

Published : Sep 19, 2019, 7:14 PM IST

మినీ గోకులాలు

ఆగిన గోకులాల బిల్లులు.... అన్నదాతలు అప్పులపాలు

పశువుల వసతి కోసం గత ప్రభుత్వ హయాంలో మినీ గోకులాలు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా పశువుల కోసం రేకుల షెడ్డు నిర్మించేందుకు గత ప్రభుత్వం ఆర్థికసాయం చేసింది. పాడి పశువుల సంఖ్యని బట్టి గోకులాలు నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది. మొత్తం వ్యయంలో 10 శాతం లోపు నగదును ప్రభుత్వానికి రైతు చెల్లించాలి. ఆ తర్వాత లక్ష రూపాయల నుంచి లక్షా 80 వేల వరకు ఖర్చు చేసి షెడ్డు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రాయితీ నిధులు మంజూరు చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పశువుల వసతి కోసం రైతులు పెద్ద సంఖ్యలో అప్పులు చేసి మరీ గోకులాలు నిర్మించారు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో.. వీరి బిల్లులు ఆగిపోయాయి. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు వాపోయారు.

ఆగిన 100 కోట్ల బిల్లులు

జిల్లా వ్యాప్తంగా సుమారు 4 వేల74 మినీ గోకులాల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి 18 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా 6 కోట్ల రూపాయలను ఇప్పటికే అందజేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్క పైసా కూడా తమకు చేరలేదని రైతులు అంటున్నారు. 6 పశువుల కోసం లక్షా 80 వేల రూపాయలతో నిర్మించిన షెడ్డులే జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. బిల్లుల చెల్లింపు సమస్య రాష్ట్ర వ్యాప్తంగానూ ఉందని.. సుమారు 100 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మినీగోకులాల షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details