రాష్ట్రవ్యాప్తంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఉపాధి లేక.. తినడానికి తిండి లేక ఎందరో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి సహాయం అందించేందుకు పలువురు దాతలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ.. దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న పోలీస్, వైద్య, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సైతం సహాయం చేస్తూ.. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కృష్ణా జిల్లా
పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న ప్రభుత్వ సిబ్బందిని ప్రశంసించారు. ఎస్ఆర్పీ ఫౌండేషన్ సుమారు రూ.15 లక్షల విలువైన నిత్యావసర సామగ్రిని దాదాపు 500 మంది ప్రభుత్వ సిబ్బందికి పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా
చోడవరంలో నిరాశ్రయులైన వారికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆహారం, కూరగాయలు పంపిణీ చేస్తున్నాయి. బాలాజీ విద్యా సేవాసంస్థ, బాలగణపతి సంఘం, గణేష్ అకాడమీ సంస్థలు రోజుకు 850 మందికి భోజనం అందిస్తున్నారు. అజీమ్ ప్రేమ్జీ ఫిలాంత్రోపిక్ ఇనీషియేటివ్స్ సంస్థ నిత్యావసరాలు అందజేసింది. అనకాపల్లిలో పోలీసు సిబ్బందికి స్టోన్ క్రషర్ యజమాని గొట్టిపాటి సుధాకర్ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా
కొత్తపేటలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు దాతలు సహాయం అందిస్తున్నారు. రావులపాలెంలోని పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మారుతినగర్ యూత్ ఆధ్వర్యంలో 43 రోజులుగా అన్నదానం నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన నివసించే నిరాశ్రయులు, యాచకులు, పేదలకు ఉదయం, సాయంత్రం పూట భోజనం అందిస్తున్నారు.