ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2020, 5:33 AM IST

ETV Bharat / state

ఆక్వారైతుకి ఆర్థిక ప్యాకేజీతోనే బాసట

కరోనా ప్రభావంతో ఆక్వారంగం తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మార్చి, ఏప్రిల్‌ నెలలో పెద్దఎత్తున ఉండే మార్కెట్ ఒక్కసారిగా కుదేలవటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా రంగానికి ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటిస్తేనే నష్టాల నుంచి గట్టెక్కగలమని రైతులు స్పష్టం చేస్తున్నారు.

Aqua sector troubles due to corona effect
ఆక్వారైతుకి ఆర్థిక ప్యాకేజీతోనే బాసట

ఆక్వారైతుకి ఆర్థిక ప్యాకేజీతోనే బాసట

కరోనా వైరస్‌ ప్రభావం ఆక్వా రంగాన్ని కుదేలు చేస్తోంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో లక్షల ఎకరాల్లో ఆక్వా సాగువుతోంది. ఆక్వా సాగుకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలు చాలా కీలకం. ఈ సమయంలో కరోనా వైరస్‌ కలకలం ఆక్వా రంగం మొత్తాన్ని ఆగమాగం చేస్తోంది. విదేశీ ఎగుమతులపై ఆధారపడిన ఈ రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడటం వల్ల వందల కోట్ల రూపాయల మేర నష్టాల్లో పరిశ్రమ కూరుకుపోతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కలకలంతో కొనుగోళ్లపై తీవ్రప్రభావం పడి రొయ్యల ధరలు 30 శాతం పడిపోయాయి.

ప్రభుత్వ ధరలో సగానికే కొనుగోలు

విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడం వల్ల శీతలీకరణ గోదాముల్లో రొయ్యల నిల్వలు పేరుకుపోయాయి. ఆక్వా రైతుల పంట ఉత్పత్తులకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కేటాయించింది. 30 కౌంట్‌ కేజీ ధర 430 రూపాయలు , 40 కౌంట్‌ ధర 310 రూపాయలు, 50 కౌంట్‌ ధర 260, పలు రకాల ధరలను ప్రభుత్వం నిర్ణయించినా... కొనుగోలుదారులు మాత్రం ప్రభుత్వ ధరలకు సగం రేటుకి కూడా కొనుగోలు చేయటం లేదని రైతులు వాపోతున్నారు.

మార్గమధ్యలోనే సరకు

చేపల విషయంలోనూ భారీ నష్టం వాటిల్లుతోందని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లిన చేపల లోడు లారీలు మార్గమధ్యలో నిలిచిపోయాయి. వాటిని దిగుమతి చేసుకునే పరిస్థితులు ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం లేకపోవటం వల్ల ఎటూ తోచని పరిస్థితి నెలకొంది. ఆక్వా రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ రంగం మనుగడ సాధ్యమని రైతులు కోరుతున్నారు.

సంక్షోభంలో ఎగుమతులు

రాష్ట్రం నుంచి విదేశాలకు చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా కంటైనర్లలో ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంటారు. కరోనా ప్రభావం కారణంగా అధిక శాతం ఎగుమతులు నిలిచిపోవటం వల్ల ఆక్వా రంగం తీవ్రసంక్షోభంలో కూరుకుపోయింది. ఈ తరుణంలో ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలంటూ ఆక్వా రైతులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి :'తమిళనాడు నుంచి జస్టిస్ కనగరాజ్​ను ఎలా తీసుకొచ్చారు?'

ABOUT THE AUTHOR

...view details