వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కుల, మత, కుటుంబం అన్న తేడా లేకుండా చిచ్చుపెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయనగరంజిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో కోదండ శ్రీరాముల విగ్రహ ధ్వంసం ఘటనపై తెదేపా చేపట్టిన దీక్షకు ఆయన హాజరయ్యారు. అనంతరం విజయనగరంలోని తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మాన్సాస్ ట్రస్టులో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలపై ఆయన మాట్లాడారు. పూసపాటి వంశీయులు విజయనగర ప్రజలకి అనేక సేవలు చేశారని బుద్ధా వెంకన్న చెప్పారు.
పూసపాటి అశోక్ గజపతి రాజు తెదేపా సీనియర్ నాయకునిగా... కేంద్ర- రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేసిన సమయంలోనూ ఎవరి మీద కక్ష సాధింపులకు పాల్పడలేదని చెప్పారు. అలాంటి వ్యక్తి కుటుంబానికి చెందిన మాన్సాస్ ట్రస్టు విషయంలో వైకాపా జోక్యం చేసుకోవాటాన్ని ఆయన ఖండించారు. మాన్సస్ లో జరుగుతున్న చర్యలకు విజయసాయిరెడ్డే కారణమని బుద్దా పేర్కొన్నారు. అదేవిధంగా విజయనగరం పర్యటనలో ముఖ్యమంత్రి రామతీర్థం ఘటనపై స్పందించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు.