సామాజిక దూరంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు. ఈ విషయంలో అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండేచోట సామాజిక దూరం పాటించేలా పర్యవేక్షిస్తున్నారు. అయినా కొంతమంది ఇవేమీ తమకు పట్టన్నట్లు ఉంటున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. నిత్యావసరాలు, కూరగాయలు, అత్యవసర పనులకు ప్రజలు ఇబ్బందులు పడకూడదని బయటికి వచ్చేందుకు ప్రభుత్వ కొంత సడలింపు ఇచ్చింది. సరైన కారణం లేకుండా ఎవరూ గడప దాటొద్దని సూచిస్తున్నారు. అయినా కొందరు వినకపోవడంతో వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇందుకు గత నెల 24 నుంచి 29 వరకు నమోదైన కేసులే నిదర్శనం.
వాహనదారులపై కొరడా
ద్విచక్ర వాహనంపై కేవలం వాహనచోదకుడు తప్ప వెనుక ఎవరూ కూర్చోకూడదు. కారైతే మరో ఇద్దరికి అనుమతిచ్చారు. అదీ కేవలం అత్యవసర సేవలకు మాత్రమే. అయినప్పటికీ చాలా మంది పట్టించుకోకుండా తిరుగుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఇవన్నీ ఈ-చలానాలే. కచ్చితంగా కట్టాల్సిందే. ఇక స్వాధీనం చేసుకున్న వాహనాలు తిరిగి ఇవ్వడం ఉండదని పోలీసులు చెబుతున్నారు.
వైరస్‌తో ఆటలా..
ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. గుంపులుగా తిరగకూడదని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది యువకులు ఇంటి పట్టున ఉండకుండా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. మైదానాలకు చేరి ఆటలాడుతున్నారు. గ్రామాల్లో ఒకచోటుకు చేరి చర్చలు పెడుతున్నారు. ఇద్దరు, ముగ్గురు కలిసి బయట తిరుగుతున్నారు. వీరిపై భౌతిక దూరం పాటించడం లేదని కేసులు నమోదు చేస్తున్నారు.